ఎవ‌రి రాజ‌ధాని అమ‌రావ‌తికి ముఖ్య‌మంత్రి స‌మాధానం ఇదే…

Chandrababu Reacts on Evari Rajadhani Amaravathi Book

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విభ‌జ‌న చ‌ట్టం, రాజ్య‌స‌భ‌లో ఇచ్చిన హామీల అమ‌లులో కేంద్రం వైఖ‌రిని వ్య‌తిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం చేసింది. ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లుపై చ‌ర్చించేందుకు వెంట‌నే పార్ల‌మెంట్ ను స‌మావేశ‌ప‌ర్చాల‌ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్ర‌తిపాదించిన తీర్మానాన్ని స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌హ‌రించిన తీరును ఖండిస్తున్నామ‌ని సీఎం చెప్పారు. అనంత‌రం అసెంబ్లీని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్టు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ప్ర‌క‌టించారు. అంత‌కుముందు విభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్రం నిర్ల‌క్ష్యం, రాష్ట్రంలోని ప్ర‌తిపక్షాల వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ సీఎం స‌భ‌లో ప్ర‌సంగించారు. ఐదుకోట్ల‌మంది ప్ర‌జ‌ల‌కు కేంద్రప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌ని ముఖ్య‌మంత్రి డిమాండ్ చేశారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోర‌డం లేద‌ని, ర‌క్ష‌ణ శాఖ‌కు కేటాయించే నిధులు ఇవ్వాల‌నీ అడ‌గ‌డం లేద‌నీ, విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీలు, ప్ర‌త్యేక హోదా అమ‌లు చేయాల‌ని మాత్ర‌మే కోరుతున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకోవ‌డం మంచిది కాద‌ని హిత‌వుప‌లికారు.

రాష్ట్రానికి న్యాయంచేయ‌మ‌ని అడిగినందుకు త‌న‌పై ఎదురుదాడి చేస్తున్నార‌ని, కేంద్రం ఏ రూపంలో దాడిచేసినా ఐదుకోట్ల మంది ఏక‌తాటిపైకి వ‌చ్చి ఎదుర్కోవాల‌ని చంద్ర‌బాబు కోరారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం అంద‌రూ సంఘ‌టితంగా ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. త‌న అనుభ‌వం వ‌ల్లే ప్ర‌జ‌లకు క‌ష్టాలు లేకుండా చేయ‌గ‌లిగాన‌ని, స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, తానెప్పుడూ మాట‌మార్చ‌లేద‌ని స్ప‌ష్టంచేశారు. టీడీపీది నీతిమంత‌మైన ప్ర‌భుత్వం కాబ‌ట్టే ఎవ‌రూ వేలెత్తి చూప‌లేక‌పోయార‌ని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేస్తోంటే… కాంగ్రెస్ తో క‌లుస్తున్నాన‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇస్తే ప్ర‌సారాలు ఆపేయాల‌ని పీఎంవో నుంచి ఒత్తిడి చేశార‌ని ఆవేద‌న‌వ్య‌క్తంచేశారు. రాష్ట్రంలోని పార్టీలు స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం త‌న‌ను విమ‌ర్శిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

ఎవ‌రి రాజ‌ధాని అమ‌రావ‌తి అని కొంద‌రు పుస్త‌కాలు రాస్తున్నార‌ని, తాను క‌ట్టే ప్ర‌జారాజ‌ధాని భావిత‌రాల‌కోస‌మేన‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టంచేశారు. అప్ప‌ట్లో ఐవైఆర్ కృష్ణారావు రాజ‌ధాని బ్ర‌హ్మాండంగా నిర్మిస్తున్నార‌ని అన్నార‌ని, ఇప్పుడేమో ఇలా పుస్త‌కాలు రాస్తున్నార‌ని, ఆయ‌న వెన‌క ఎవ‌రున్నార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. త‌మిళ‌నాడుకు చెన్నై, క‌ర్నాట‌కకు బెంగ‌ళూరు, మ‌హారాష్ట్ర‌కు ముంబై, తెలంగాణ‌కు హైద‌రాబాద్ లాంటి గొప్ప న‌గ‌రాలు ఉన్నాయ‌ని, మ‌రి ఏపీకి అమ‌రావ‌తి ఉండ‌కూడ‌దా… అని చంద్ర‌బాబు నిల‌దీశారు. ఒక నాయ‌కుడు రాజ‌ధాని నిర్మాణానికి ఇంత భూమి ఎందుక‌ని మాట్లాడుతున్నార‌ని, ఆ మాట‌ల వెన‌క ఉద్దేశ‌మేమిట‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నంచారు. ఆనాడు ఒక‌వేళ తాను అంద‌రి విమ‌ర్శ‌లు ప‌ట్టించుకుని హైద‌రాబాద్ ను అభివృద్ధి చేసి ఉండ‌క‌పోతే… ఈ రోజు ఆ న‌గ‌రం ఇంత‌టి స్థాయిలో ఉండేది కాద‌ని, అదే ప‌ట్టుద‌ల‌తో అమ‌రావ‌తిని ప్ర‌జారాజ‌ధానిగా తీర్చిదిద్దుతాన‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టంచేశారు.