‘మహా సంప్రోక్షణ’ వివాదం మీద చంద్రబాబు కీలక ఆదేశాలు !

Chandrababu reacts on TTD Maha Samprokshanam Issue

తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువును ఆగస్టు 11 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరు రోజుల పాటు భక్తులకు పూర్తిగా శ్రీవారి దర్శనం నిలిపివేయనున్నట్టు టీటీడీ పాలక మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. టీటీడీ నిర్ణయంపై అనేక అపోహలు, విమర్శలు తలెత్తడంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. గతంలో మహాసంప్రోక్షణం సందర్భంగా పాటించిన నియమాలనే అమలుచేయాలని, ఆగమ శాస్త్ర పద్దతుల ప్రకారమే పూజాధికాలు నిర్వహించాలని, మహాసంప్రోక్షణ క్రతువుకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడరాదని ఆయన టీటీడీకి సూచించారు. పరిమితి సంఖ్యలో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేయాలని బాబు టీటీడీని కోరారు. అంతేకాదు, శ్రీవారి దర్శనానికి రోజుల తరబడి భక్తులు వేచి చూసేలా చేయొద్దని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగరాదని అధికారులను ఆదేశించారు. గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలను అనుసరించాలని, ఎంత మందికి దర్శనం వీలు అయితే అంత మందికి దర్శనం చేపించాలని సూచించారు…

మరోవైపు మహా సంప్రోక్షణ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నా ఎలాంటి ఫలితం ఉండదని, లక్షలాది మంది భక్తుల్లో కొందరికి మాత్రమే దర్శన అవకాశం కలుగుతుందని, ఈ కారణంతోనే పూర్తిగా స్వామి దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో స్వామివారి అంశ ఓ పూర్ణకుంభంలో ప్రవేశపెడతారనీ గర్భగుడిలోని విగ్రహానికి ఎలాంటి శక్తీ ఉండదని ఆగమ శాస్త్రం చెబుతోందని ఆయన అన్నారు. స్వామి అంశను తిరిగి ఆలయంలోని మూల విరాట్టులోకి ప్రవేశపెట్టిన తరువాత తిరిగి దర్శనాలు ప్రారంభిస్తామని, దీన్ని భక్తులు అర్థం చేసుకోవాలని జేఈఓ పేర్కొన్నారు. ఈ ఆరు రోజుల పాటు ఆలయంలోకి ఎవరినీ అనుమతించబోమని, పాలక మండలి కుటుంబీకులకు కూడా ప్రవేశం ఉండదని, కేవలం రుత్వికులు మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.