Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి దర్శక ధీరుడు రాజమౌళి తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న భవనాలకు సంబంధించిన డిజైన్లను లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ అందిస్తోంది. ఈ సంస్థ తాము రూపొందించిన తుది డిజైన్లను ముఖ్యమంత్రికి అందించింది. దీనిపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు డిజైన్లపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన కొన్ని డిజైన్లు బాగున్నప్పటికీ… మరికొన్ని ఆకృతుల బాహ్యరూపం అంత బాగా లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కొంత సమయం తీసుకుని అత్యుత్తమ డిజైన్లు రూపొందించాలని, ఇందుకోసం ప్రపంచంలో తొలి పది అత్యుత్తమ నిర్మాణాలను పరిశీలించాలని కోరారు.
సీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఆర్కిటెక్ట్ లతో పాటు, రాష్ట్రంలో పేరొందిన ఆర్కిటెక్ట్ లతో ఓ బృందం ఏర్పాటు చేయాలని… డిజైన్ల రూపకల్పనలో ఈ టీమ్ ఫోస్టర్ బృందానికి సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. నూతన డిజైన్ల రూపకల్పనలో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళితో వెంటనే సంప్రదింపులు జరపాలని, అవసరమైతే కొత్త బృందంతో పాటు రాజమౌళిని లండన్ పంపించాలని చంద్రబాబు సీఆర్ డీఏను ఆదేశించారు. అక్టోబరు 25న తాను స్వయంగా లండన్ వెళ్తానని, అక్కడ ఫోస్టర్ కార్యాలయాన్ని సందర్శించి నవ్యాంధ్ర నిర్మాణాల డిజైన్లను పరిశీలిస్తానని సీఎం తెలిపారు. అక్టోబరు చివరినాటికి డిజైన్లును ఖరారు చేస్తామన్న బాబు, డిజైన్ల తయారీలో పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించి అద్భుతమైన సృజనాత్మకత ప్రదర్శించాలని కోరారు. మొత్తానికి నవ్యాంధ్ర నిర్మాణాల రూపకల్పనలో రాజమౌళి ముఖ్య పాత్ర పోషించనున్నారు. బాహుబలిలో అద్భుతమైన సెట్లు వేయించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళితో నవ్యాంధ్ర డిజైన్లు గీయించుకోవాలని ఏపీ సర్కారు గతంలోనే నిర్ణయించుకున్నట్టు వార్తలొచ్చాయి. చంద్రబాబు తాజా ఆదేశాలతో జక్కన్న ఇక నవ్వాంధ్ర కు కొత్తరూపు ఇవ్వనున్నారు.