ప్రజలు స్థానిక నాయకత్వంపై సందేహాలు వదిలేసి తనపై నమ్మకం ఉంచాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్ సభ స్థానాల్లో అన్నింటా తానే అభ్యర్థినని, తనను చూసి ఓటేయాలని కోరారు. ఎప్పుడో మహదేవనాయుడు మాట్లాడలేదని, శివరామరాజు ఎక్కడన్నా కనిపిస్తే పలకరించలేదని, కింద ఉన్న తమ కార్యకర్తలు సరిగా ప్రవర్తించలేదని ఆ కోపం తనపై చూపించవద్దని ఆయన తాజాగా నరసాపురం పర్యటనలో ప్రసంగించి చమత్కరించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన పక్కనే ఉన్న టీడీపీ అభ్యర్థులు మహదేవనాయుడు, శివరామరాజులు ఒకరి ముఖం ఒకరు చూస్కుని చిరునవ్వులు రువ్వారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు జనసేనాని పవన్ కల్యాణ్ పైనా వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని అన్నారు. పవన్ కల్యాణ్ కు అత్తారింటికి దారి మాత్రమే తెలుసని, ఆయనకు మిగతా దారులు తెలియవని చెప్పారు. అందుకే ఓటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఓటేసి నష్టపోకూడదని, ఓటు వృధా చేసుకోవద్దని నరసాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నరసాపురంలో జనసేన ఎంపీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.