బీజేపీతో సంబంధాల‌పై చంద్ర‌బాబు అభిప్రాయం

Chandrababu says Relationship with BJP in Delhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీజేపీతో ఇక‌పై ఎలాంటి సంబంధాలూ ఉండ‌బోవ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఢిల్లీలో స్ప‌ష్టంచేశారు. విభ‌జ‌న హామీల అమ‌లుకు వివిధ పార్టీల మ‌ద్ద‌తు సేక‌రించే ల‌క్ష్యంతో ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్ లో మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు. త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న కేవ‌లం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మేన‌ని, రాజ‌కీయ ఉద్దేశాల‌కు ఇందులో తావులేద‌ని చంద్ర‌బాబు చెప్పారు. జాతీయ రాజ‌కీయాలు, ఇత‌ర అంశాల‌పై మాట్లాడేందుకు నిరాక‌రించారు. బీజేపీ, వైసీపీ మ‌ధ్య స‌త్సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని, ఒక అవినీతి పార్టీని చేర‌దీసినందుకు బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. ప్ర‌ధాని కార్యాల‌యాన్ని వైసీపీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాడుకుంటోంద‌ని ఆరోపించారు.

విభ‌జ‌న త‌ర్వాతి ప‌రిణామాలు, కేంద్రం వైఖ‌రి, ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, పెండింగ్ లో ఉన్న హామీలు, పోల‌వ‌రం, వెనుక‌బ‌డిన జిల్లాలకు నిధులు ఇచ్చిన‌ట్టే ఇచ్చి వెన‌క్కితీసుకోవ‌డం వంటి విష‌యాల‌ను ముఖ్య‌మంత్రి మీడియాకు వివ‌రించారు. తొలిరోజు ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ముందుగా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని మ‌హాత్ముడి విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ప్రాంతీయ‌, జాతీయ మీడియా జ‌ర్న‌లిస్టులంద‌రూ చూస్తుండ‌గా పార్ల‌మెంట్ మెట్ల‌ను తాకి న‌మ‌స్క‌రించి సెంట్ర‌ల్ హాల్ లోకి వెళ్లారు. అనేక రాజకీయ పార్టీల‌కు చెందిన పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత‌లు, ఎంపీల‌ను క‌లిశారు. అవిశ్వాస‌తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అన్నాడీఎంకె స‌హా అన్ని పార్టీల ఫ్లోర్ లీడ‌ర్ల‌ను కోరారు. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు తెలుగు రాష్ట్రాల మీడియానే కాక‌… జాతీయ మీడియా సైతం అమిత ప్రాధాన్యం ఇస్తోంది.