ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడిన మాటలివే…

AP Cm Chandrababu Transfer Of Cash To Farmers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేంద్రం వైఖ‌రిని నిర‌స్తూ ఎపికి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నేడు చేప‌ట్టిన దీక్ష ముగిసింది. విజయవాడలోని మున్సిపల్‌ మైదానంలో ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ చంద్రబాబు ఈ దీక్షలో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం సిఎం చంద్ర‌బాబుకు ఇద్ద‌రు చిన్నారులు నిమ్మ‌రం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేశారు. తదుపరి సీఎం విజయ శంఖం పూరించారు. అనంతరం కొద్దిసేపు మౌనంగా ఉన్న సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా చంద్రబాబుతో పాటు దీక్షలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు పావులూరి శివరామకృష్ణ గురించి ప్రస్తావించిన సీఎం ఆయన 96 ఎల్లా వయసులో కూడా తన స్వరాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసారని కొనియాడారు. అలాగే తన పుట్టినరోజు నాడు దీక్ష చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదని చెప్తూ సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.

ఏపీకి అన్యాయం జరిగితే ఉపేక్షించేదిలేదని, దాని కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తనను ఆశీర్వదించిన సర్వమత పెద్దలకు, దీక్షకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తానూ ఒక పార్టీ అద్యక్ష్యుడిగా ఈ దీక్ష చేయలేదని ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరఫున తాను ఈ దీక్ష చేశానన్నారు. అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ ఒక అవగాహనకు వచ్చి రాష్ట్రాన్ని విభజించారని చంద్రబాబు అన్నారు. నాడు విభజన తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఎనిమిది రోజులు దీక్ష చేసిన సంగతిని చంద్రబాబు గుర్తు చేశారు. ఇది మనం కోరుకోని విభజన, అప్పట్లోనే సమన్యాయం చేయాలని కోరాను అయినా వినలేదని కేవలం స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా విభజించారని చంద్రబాబు అన్నారు.

తన దీక్షకి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీక్షలు చేశారని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అందరూ నిందించారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలే దీక్షకు దూరంగా ఉన్నాయని వైసీపీని ఉద్దేశ్యించి బాబు అన్నారు. ఈ దీక్ష తానొక్కడే చేయలేదని తనది ఐదు కోట్ల ఆంధ్రుల దీక్ష అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. పార్టీల ఎజెండాలను ఎన్నికలకే పరిమితం చేయాలని, రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు అండగా నిలవాలని చంద్రబాబు కోరారు. సమన్యాయం చేయాలని ఆనాడు ఢిల్లీలో పోరాడానని, సమన్యాయం జరిగితే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు గెలవలేమని తెల్సినా కేంద్రంలో వచ్చే పార్టీ అదే కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఎన్డీయేలో చేరామని అంతే తప్ప వేరే ఏ ఉద్దేశ్యం లేదన్నారు… తిరుపతి సభలో మోడీ చెప్పిందేమిటి? ఇప్పుడు చేసిందేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తానేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఆరోజు విభజన సమయంలో, ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నానని చంద్రబాబు అన్నారు.

బీజేపీతో కలిసిందే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అది చేయనప్పుడు ఇంకా అంటకాగాల్సిన అవసరం ఎముందని చంద్రబాబు అన్నారు. వాజపేయి హయంలో 29 మంది ఎంపీలు ఉండి కూడా ఎటువంటి పదవీ కాంక్ష లేకుండానే బీజేపీకి మద్దతు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. అలాగే పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపకపోతే… సీఎం పదవి చేపట్టబోనని ఆనాడే చెప్పానని అందుకే ఆ పని వెనువెంటనే కేంద్రం పూర్తి చేసిందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. చంద్రబాబుకు మద్దతుగా అన్ని జిల్లాల్లో మంత్రులు దీక్షలు చేశారు. సీఎం చేపట్టిన దీక్షకు అనూహ్య మద్దతు లభించింది. ధర్మ పోరాట దీక్షలో సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, రాఘవేంద్రరావు, అశ్వీనిదత్‌, శివాజీ పాల్గొన్నారు. వీరే కాక తెలుగు బుల్లితెరకు చెందిన నటీనటులు కూడా ఈరోజు అమరావతిలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించారు.