Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో ఓ పాత నానుడి వుంది. అన్నం ఉడికిందో,లేదో తెలుసుకోడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు అని. ఇప్పుడు మిత్రపక్షం అనే ముద్రవేసుకున్న టీడీపీ, బీజేపీ మధ్య బంధం ఎలా వుందో తెలుసుకోడానికి ఒకటి రెండు కాదు ఎన్నో ఉదాహరణలు. మరెన్నో సంకేతాలు. ఎవరి అవసరార్ధం వాళ్ళు ఇన్నాళ్లు పైకి మౌనం పాటిస్తున్నా లోలోన తమవైన రాజకీయాలు చేస్తూనే వున్నారు. ఈ విషయంలో కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. అయితే ఇన్నాళ్లు బీజేపీ ని బయటపడేస్తే తన ప్రతిష్టకు కూడా దెబ్బ తగులుతుందని భావించిన చంద్రబాబు కాస్త సంయమనం పాటించారు. కానీ ఆంధ్రప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలవరం కి కూడా గండి కొట్టడంతో తట్టుకోలేకపోయారు. అసెంబ్లీ లోపల , బయట పోలవరం సహా కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, విడుదల చేసిన నిధుల గురించి బయట పెట్టేసారు.
ఏ రాజకీయం కోసం అయితే బీజేపీ పోలవరంపై కొర్రీ వేసిందో అదే రాజకీయంతో బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రజల దృష్టిలో పోలవరం విషయంలో బీజేపీ ని దోషిగా నిలబెట్టారు. ఇంకా తెలివిగా తన మీద లేనిపోనివి చెబుతూ ఢిల్లీకి , అమరావతికి మధ్య దూరం పెంచిన బీజేపీ నేతలతో మీరే కేంద్రాన్ని ఒప్పించాలని కూడా బాబు ఓ మెలిక పెట్టారు. బాబు రాజకీయంతో బీజేపీ షాక్ తినడం ఖాయం అనిపిస్తోంది. బాబు వేసిన ఎత్తుగడతో బీజేపీ అడ్డంగా బుక్ అయిపోయింది. పోలవరం ఆగితే ఆ పాపం అంతా బీజేపీ మీద పడుతుంది. ఒకవేళ కేంద్రం తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు కోటాలో జమ అవుతుంది. లేదా చంద్రబాబు మీద కేసులు ఇతరత్రా అణచివేత చర్యలకు పాల్పడ్డా పోలవరం అడిగినందుకు ఇలా చేస్తున్నారని ఆయనకే సానుభూతి వస్తుంది. ఇన్ని విదాలుగా బీజేపీ ని ఇరికికించిన బాబు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో జట్టు కట్టడం కష్టం. ఆ బంధం ఇక తెగిపోయినట్టే. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ, బాబు కాపురం లో మనసులు కలవలేదు. విడాకులు వచ్చే దాకా కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది అంతే.