మోడీ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం ?

modi and chandrababu naidu

ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారా? దీనికి సమాధానంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. మోడీ పోటీ చేస్తున్న వారణాసికి కూడా చంద్రబాబు వెళతారని ఆయనకు అక్కడ వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని చెప్పారు. మోడీ ద్రోహాన్ని, కుయుక్తులను వారణాసి వేదికగా ఎండగడతారని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 23వ తేదీని టీడీపీ ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. 23న వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ రానంతగా ఈసీ మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయని దీనికి కారణం ఇది మోడీ నియమించిన ఈసీ కావడమేనని ఆయన అన్నారు. ఈసీ మద్దతుతోనే వైసీపీ అరాచకాలకు తెగబడిందని అన్నారు. అరాచకాలకు పాల్పడిన వైసీపీకే మోడీ నియమించిన గవర్నర్ కూడా అపాయింట్ మెంట్ ఇస్తారని ఆయన విమర్శించారు.