భారీ ఎత్తున సాగిన బాబు ప‌ర్య‌ట‌న

భారీ ఎత్తున సాగిన బాబు ప‌ర్య‌ట‌న

అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న భారీ ఎత్తున సాగింది. ఆయ‌న మంది, మార్బ‌లంతో భారీగా అమ‌రావ తిలో ప‌ర్య‌టించారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు హ‌యాంలో క‌ట్టిన నిర్మాణాలు మిన‌హా అక్క‌డ ఏమీ లేవు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏర్పాటై ఐదు మాసాలే గ‌డిచింది. అందునా అమ‌రావ‌తి అస‌లు అవ‌స‌ర‌మో కాదో తేల్చేందుకు సీనియ‌ర్ ఐఏఎస్ జీ ఎన్ రావు నేతృత్వంలో క‌మిటీ వేసింది.ఈ క‌మిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి అనేక మంది నుంచి అభిప్రాయాలు సేక‌రిస్తోంది. మ‌రోప‌క్క‌, అమ‌రావ‌తి వ‌ల్ల అన్నీ ఒకే చోట కేంద్రీకృత‌మ‌వుతాయి కాబ‌ట్టి  మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి స‌న్న‌గిల్లుతుంద‌నే వాద‌న ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల‌నే డిమాండ్‌తో ఉద్య‌మాలు ఊపం దుకున్నాయి. ఇక‌, ఉత్త‌రాంధ్ర అభివృద్ధి కోసం అక్క‌డి నాయ‌కులు కూడా ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆత్మ సంఘ‌ర్ష‌ణ‌లో ప‌డింది. దీంతో ఎట్టి ప‌రిస్థితిలోనూ అమ‌రావ‌తిని త‌ర‌లిస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇక‌, త్వ‌ర‌లోనే జీఎన్ రావు క‌మిటీ త‌న నివేదిక‌ను ఇవ్వ‌నుంది.