ఏపీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా రేపు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటూ తెలుగు రాష్ట్రాల్లో నేతలు, పలువురు జాతీయ నేతల్ని ఆహ్వానించారు. చంద్రబాబుకు కూడా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ తరపున ఇద్దరు సీనియర్ నేతలను ప్రతినిధుల్ని ఈ కార్యక్రమానికి పంపాలని తీర్మానించారు. గురువారం ఉదయం టీడీపీ బృందం జగన్ నివాసానికి వెళ్లనుంది. జగన్‌కు శుభాకాంక్షలు తెలుపనున్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎల్పీ సమావేశంలో ప్రమాణ స్వీకారానికి జగన్ చంద్రబాబును ఆహ్వానించిన విషయం మీద నేతలు చర్చించారట. జగన్ చంద్రబాబును ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే బాగుండేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇంటికెళ్లి మరి ఆహ్వానించిన జగన్ బాబుకు మాత్రం ఫోన్ చేయడం ఏంటని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారట. సమావేశంలో ఎక్కువమంది నేతలు చంద్రబాబు.. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అందుకే బాబు వెనక్కు తగ్గినట్టు సమాచారం.
