కడప పెద్ద దర్గాను దర్శించుకున్న జగన్

Jagan visited Kadapa big dargah

రేపు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ ఈ ఉదయం  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నారు. కడప విమానాశ్రయం వద్ద వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతితో పాటు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ శ్రేణులు జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. దర్గా వద్ద ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దర్గాకు వచ్చిన  జగన్‌కు దర్గా మతపెద్దలు సాంప్రదాయ రీతిలో తలపాగా చుట్టారు. దర్గాలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్‌ సమర్పించారు. జగన్‌ వెంట పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాష్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. జగన్ కలవడానికి అక్కడికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ వారందరినీ పలకరించారు.  పెద్ద దర్గా సందర్శన అనంతరం వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా పులివెందుల బయలుదేరి వెళ్లారు. అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.