అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌గా మార్చి..

Change the international calls as local calls

అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మారుస్తూ మెసానికి పాల్పడుతున్న ముగ్గురిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఏపీ గుంటూరు ప్రాంతానికి చెందిన మురళీ హైదరాబాద్‌కు వలస వచ్చి నేతాజీనగర్‌లో నివాసముంటున్నాడు. స్వల్ప కాలంలో నగదును సంపాదించాలనే ఆశతో అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను అక్రమ పద్ధతిలో లోకల్ కాల్స్‌గా మార్చాలని స్కెచ్ వేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ నెట్ వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తుండడంతో టెక్నాలజీ మీద కొంత అవగాహన సంపాదించుకున్నాడు. అంతేకాకుండా 2010లో ముంబైలో పనిచేసినప్పుడు వర్థా అనే వ్యక్తి పరిచయంతో ఆ సమయంలో ఓ కంపెనీకి సంబంధించిన సీడీఎం ఫోన్ల ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి 15 లక్షల రూపాయలను సంపాదించాడు. తాజాగా ఆ అనుభవంతో మరోసారి ఈ అక్రమ దందాను స్నేహితులైన ప్రసన్న కుమార్, స్వరూప్‌నాథ్ చౌదరిలతో కలిసి మురళీ.. బీఎస్‌ఎన్‌ఎల్ లైన్ల ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌గా మార్చాడు. దీని కోసం చైనాకు చెందిన చైనా స్కైలైన్, అమెరికాకు చెందిన వీఎస్‌వీఓఎక్స్, దుబాయికు చెందిన బీఆర్‌బీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నిమిషానికి 12 పైసలకే అంతర్జాతీయ కాల్స్‌ను అందిస్తున్నాడు. గత మూడునెలల్లో ఈ అక్రమ వ్యాపారం ద్వారా రూ. 14 లక్షలను సంపాదించి బీఎస్‌ఎన్‌ఎల్‌కు నష్టం కలిగించారు. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు నిందితులైన మురళీ, ప్రసన్నకుమార్, స్వరూప్‌నాథ్ చౌదరిను అరెస్టు చేసి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.