నటి, నిర్మాత చార్మీ కౌర్ తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. అక్టోబర్ 22న వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆమె సోషల్ మీడియాలో ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా వారి ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేశారు. “నా పేరెంట్స్‌ను నవ్వు ముఖాలతో చూడటం చాలా బాగుంది” అని సంతోషం వ్యక్తం చేశారు. కాగా చార్మీ ఆదివారం నాడు దసరా శుభాకాంక్షలు చెప్తూనే తన తల్లిదండ్రులకు కరోనా సోకిందంటూ అభిమానులకు ఎమోషనల్ మెసేజ్‌ను అందజేశారు.
“లాక్డౌన్ ప్రారంభమైన మార్చి నుంచి వారు నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. అయినా దురదృష్టం కొద్దీ వారు కోవిడ్-19 బారిన పడ్డారు. బహుశా హైదరాబాద్ వరదల మూలాన ఇది జరిగి ఉంటుంది. ఇప్పటికే మా నాన్నకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈ వార్త విని నా గుండె ముక్కలయ్యింది. వెంటనే అమ్మానాన్న ఇద్దరూ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నాకు చాలాకాలంగా తెలిసిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం నా తల్లిదండ్రులు చికిత్సకు స్పందిస్తున్నారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
“నేను మీకు ఒకటే సలహా ఇస్తున్నాను. మీకు కరోనా లక్షణాలుంటే ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోండి. తొలిదశలోనే గుర్తించగలిగితే చాలావరకు నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నేను నా తల్లిదండ్రులను తిరిగి ఆరోగ్యంతో చూసుకునేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను. ఆ దుర్గామాత మిమ్మల్ని చెడు నుంచి రక్షించి సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరెంట్స్ త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేయండి” అని చార్మీ అభిమానులకు సూచించారు.