చార్మినార్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న వైద్య విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. విద్యార్థిని కాళ్లతో తొక్కి గోళ్లతో తాకరాని చోట గిచ్చిన కానిస్టేబుల్ పరమేశ్‌ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటన మీద విచారణకు ఆదేశించారు. యునానీ ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వైద్య విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం చార్మినార్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థునులను చెదరగొట్టారు.
ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. విద్యార్థులను వ్యాన్‌లో ఎక్కించే క్రమంలో కానిస్టేబుల్ పరమేశ్ ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినిని గోళ్లతో గిచ్చాడు. టచ్ చేయొద్దంటూ బాధితురాలు వారిస్తున్నా అతడు వినిపించుకోలేదు.
బాధతో విలవిల్లాడుతూ ఆ విద్యార్థిని రోదించింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ పరమేశ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అతడి తీరును మహిళా సంఘాలు తీవ్రంగా నిరసించాయి. అతడిని విధుల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.