సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా గోల్డెన్ డక్ అయ్యాడు. లుంగీ ఎన్గిడి బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎన్గిడి వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతి పుజారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి కీగన్ పీటర్సన్ చేతిలో పడింది. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా గోల్డెన్ డక్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే పుజారా ఔట్ కావడం ఇక్కడ మరో విశేషం.
2107-18లో సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పుజారా ఎన్గిడి బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. అప్పుడు ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న పుజారా పరుగులేమి చేయకుండానే రనౌట్ రూపంలో గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా మరోసారి పుజారా ఎన్గిడి బౌలింగ్‌లోనే అదే సెంచూరియన్‌లో గోల్డెన్ డక్ కావడం ఆసక్తి కలిగించింది.
ఇక పుజారా చెత్త ప్రదర్శనపై నెటిజన్లు ఏకిపారేశారు. ”నిన్ను మరో ద్రవిడ్‌లా ఊహించుకున్నాం.. మా ఆశలన్నీ వ్యర్థమవుతున్నాయి”.. ”డమ్మీ ద్రవిడ్ గోల్డెన్ డక్ అయ్యాడు”..” మొన్న రహానే.. ఇవాళ నువ్వు.. మీరిద్దరు జట్టుకు చోకర్స్‌గా మారారు”.. ”పుజారా స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశమిచ్చినా బాగుండేది”.. పుజారా డకౌట్‌లు అవుతూనే ఉన్నాడు.. ఇంకా ఎన్ని చాన్స్‌లు ఇస్తారు.. హనుమ విహారి లాంటి ఆటగాళ్లు బెంచ్‌పై కూర్చొని కోపంతో రగిలపోతున్నారు.. వాళ్లకు అవకాశమివ్వండి” అంటూ కామెంట్స్ చేశారు.