Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ జర్నలిస్ట్ జేడే హత్య కేసులో గ్యాంగ్ స్టర్ ఛోటారాజన్ సహా ఏడుగురిని దోషులకు ముంబై సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మిడ్ డే పత్రికలో క్రైమ్ ఎడిటర్ అయిన జేడే విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా… 2011 జూన్ 11 న కొందరు దుండగులు కాల్చి చంపారు. మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు జేడేపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ జేడేని ఆస్పత్రికి తరలిస్తుండగా… మార్గమద్యంలోనే కన్నుమూశారు. ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ముంబైలో నేర చరిత్ర కలిగిన 20 మందికి సంబంధించి… సంచలన విషయాలను వెలుగులోకి తెస్తున్న క్రమంలో జేడే హత్యకు గురవడంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
తొలుత వృత్తిరీత్యా ఉన్న శతృత్వంతో జిగ్నావోరా అనే జర్నలిస్ట్ జేడేను హత్యచేసి ఉంటుందని భావించిన పోలీసులు ఆమెను నిందితురాలిగా అనుమానించారు. తర్వాత విచారణలో అసలు నిజం వెలుగుచూసింది. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న జేడేపై కక్ష గట్టిన ఛోటా రాజన్ ఈ హత్యకు ప్రణాళిక రచించాడు. సతీశ్ కాలియా అనే కాంట్రాక్ట్ కిల్లర్ కు రూ. 5లక్షలు ఇచ్చి జేడేను హత్యచేయించాడు. హత్య తరువాత పరారైన సతీశ్ ను రామేశ్వరంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఛోటారాజన్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ముంబై సెషన్స్ కోర్టు ఛోటారాజన్ ను, మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కాగా ఛోటారాజన్ ఇప్పటికే నకిలీ పాస్ పోర్టు కేసులో తీహార్ లో జైలు జీవితం గడుపుతున్నాడు.