టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన సుజ‌నా చౌద‌రి వ్య‌వ‌హారం

Sujana Chowdary Affair Is A Hot Topic In TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీడీపీ, బీజేపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో సుజ‌నా చౌద‌రి గురించి న‌డుస్తున్న ఓ ఊహాగానం రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు కేంద్రమంత్రిగా ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత సుజ‌నా చౌద‌రి..పార్టీని వీడి బీజేపీలో చేర‌నున్నారంటూ వ‌చ్చిన ఓ వార్త కలక‌లంగా మారింది. రెండురోజుల క్రితం ద‌క్క‌న్ క్రానిక‌ల్ ప్రచురించిన వార్త‌పై టీడీపీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్ర మంత్రిగా ప‌నిచేసినప్పుడు ప్ర‌ధాన‌మంత్రికి, ముఖ్య‌మంత్రికి అనుసంధానంగా వ్య‌వ‌హ‌రించిన సుజ‌నా…ఆ స‌మ‌యంలోనే బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు చేరువ‌య్యార‌ని, చంద్ర‌బాబుతో విభేదాల నేప‌థ్యంలో ఇప్పుడు పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని ద‌క్క‌న్ క్రానిక‌ల్ త‌న క‌థ‌నంలో వెల్ల‌డించింది. త‌న‌కు ప్ర‌ధాని అపాయింట్ మెంట్ ఇప్పించ‌డం స‌హా అనేక అంశాల్లో కేంద్ర‌మంత్రిగా సుజ‌నా విఫ‌లమ‌య్యార‌ని చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తంచేయ‌డం…ఇద్ద‌రి మ‌ధ్యా విభేదాల‌కు దారితీసిన‌ట్టు స‌మాచారం.

నంద్యాల ఉప ఎన్నిక‌లను వాయిదా వేయించాల‌ని భావించిన చంద్ర‌బాబు..ఇందుకోసం కేంద్రాన్ని ఒప్పించే బాధ్య‌త‌ను సుజ‌నాకు అప్ప‌గించ‌గా..సుజ‌నా ఆ ప‌నిచేయ‌లేక‌పోవ‌డం చంద్ర‌బాబుకు ఆగ్ర‌హం తెప్పించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో పాటు..ఏడాదిన్న‌ర‌పాటు..మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోయినా..స‌రైన లాబీయింగ్ చేయ‌డంలో సుజ‌నా విఫ‌ల‌మ‌య్యారని కూడా చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని, కేంద్ర మంత్రి హోదాలో ఉండి దేశ ప్ర‌ధానిని, రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఒక‌చోట కూర్చోబెట్టే ప‌నిచేయ‌లేక‌పోయార‌ని సుజ‌నా వ‌ద్దే చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తంచేశార‌నీ స‌మాచారం. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి స్వ‌ప్రయోజ‌నాలు, బీజేపీ ప్ర‌యోజ‌నాల‌కు సుజ‌నా ప్రాధాన్య‌త ఇచ్చార‌ని, అంతేకాకుండా…ఏపీ ప్ర‌జ‌ల్లోని హోదా సెంటిమెంట్ ను కేంద్రానికి చెప్ప‌డంలో సుజ‌నా విఫ‌ల‌మ‌య్యార‌ని చంద్ర‌బాబు భావిస్తున్నట్టూ వార్త‌లూ వినిపిస్తున్నాయి. మ‌రో ప‌క్క సీనియ‌ర్ అయిన త‌న‌ను ప‌క్క‌న‌పెట్టి చంద్ర‌బాబు గ‌ల్లాజ‌య‌దేవ్, కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడిని ప్రోత్స‌హిస్తున్నార‌ని సుజనా ఆవేద‌న‌తో ఉన్నార‌ని కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి.

ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లుకోసం కేంద్ర‌మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని టీడీపీ నిర్ణ‌యించి…మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశించిన‌ప్పుడు సుజ‌నా అయిష్టంగానే రాజీనామా చేసిన‌ట్టు గ‌తంలోనే వార్త‌లొచ్చాయి. కేంద్ర‌ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా సుజ‌నా…ప్ర‌ధానితో స‌మావేశ‌మ‌వ‌డం, ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ తోనూ సుజ‌నా చౌద‌రి భేటీ కావ‌డం వంటి ప‌రిణామాలు సుజనా పార్టీ మార‌తార‌న్న ఊహాగానాల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. మ‌రో కోణంలో కూడా…ఈ వార్త‌ను విశ్లేషిస్తున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. మీడియాపై యుద్ధం ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలుత టీవీ 9, టీవీ 5, ఏబీఎన్, మ‌హాన్యూస్ చాన‌ళ్ల ను బ‌హిష్క‌రించాల‌ని త‌న అభిమానుల‌కు పిలుపునిచ్చి…ఆ త‌ర్వాత రోజే మ‌హాన్యూస్ ను ఆ జాబితా నుంచి త‌ప్పించ‌డానికి…సుజ‌నా చౌద‌రికి బీజేపీతో ఉన్న అనుబంధ‌మే కార‌ణ‌మ‌న్న అభిప్రాయం విన‌ప‌డుతోంది.