ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. దీనికి ముందు…ఢిల్లీలోని చిదంబరం ఇంటికొచ్చిన సీబీఐ, ఈడీ అధికారులను వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.
గంట దాకా చేసుకున్న హైడ్రామా తర్వాత గోడ దూకి మరి ఇంట్లోకి అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి మెడికల్ టెస్ట్‌లు నిర్వహించని అధికారులు ఇవాళ కోర్టు ముందు ఆయనను హాజరు పరచనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు ఆయన ఉంటికి వచ్చింది సీబీఐ.
దీంతో సీబీఐని లోపలికి రానివ్వకుండా చిదంబరం సెక్యూరిటీ అడ్డుకుంది. దీంతో కాసేపు హైడ్రామా నడిచింది. చివరకు గోడ దూకి లోపలికి వెళ్లిన అధికారులు చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల తర్వాత అజ్ఞాత వీడిన చిదంబరం… ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.
కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తాను నిందితుడ్ని కాదని చెప్పుకొచ్చారు చిదంబరం. అలాగే, చార్జిషీట్లో కూడా తన పేరు లేదన్నారు. తనతో పాటు తన తనయుడికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా… తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు చిదంబరం.
తాను ఎక్కడికి వెళ్లిపోలేదని తెలిపారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ కోసం గత రాత్రంతా తన లాయర్లతో కలిసి చర్చించినట్టు వివరించారు చిదంబరం. తాను చట్టాన్ని గౌరవిస్తానని… దర్యాప్తు సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించాలన్నారు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం.
గత కొద్దిరోజులుగా ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. దీంతో చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అయితే అక్కడ లేకపోవడంతో సీబీఐ బృందం వెనుదిరిగింది.
మరోవైపు హైకోర్టు ముందస్తు బెయిల్‌కు నిరాకరించడంతో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు నిరాశ తప్పలేదు. దీంతో.. ఊహించని విధంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమై మీడియాతో మాట్లాడారు. సమావేశం తర్వాత అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి వెళ్లారు చిదంబరం.
కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ కూడా ఆయనతో పాటు ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. సీబీఐ, ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా.. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సీబీఐ అధికారులు గోడదూకి లోపలికి ప్రవేశించారు.
ఢిల్లీ పోలీసుల సహకారంతో సీబీఐ ఆర్థిక, నేర విభాగ జాయింట్ డైరెక్టర్ చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు. కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన్ను తరలించారు. వైద్య పరిక్షల తర్వాత సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరిలించారు అధికారులు. సీబీఐ అరెస్ట్ చేసింది కాబట్టి ఆయన ఇప్పుడు సీబీఐ కోర్టులో మళ్లీ కొత్తగా బెయిల్‌ను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడం సందేహమే. అదే సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తాము చిదంబరాన్ని విచారించాల్సి ఉంటుందని సీబీఐ పిటిషన్ దాఖలు చేస్తే.. సీబీఐ కోర్టు ఆయన్ను 14 రోజుల కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా ఉంది.
ఆ రెండు వారాలతో చిదంబరం కథ ముగిసిపోదు. సీబీఐ కస్టడీ ముగిసిన వెంటనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్‌పై విచారించేందుకు చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ కోరే అవకాశం ఉంది.
ఒకవేళ కోర్టు ఈడీ కోరికను మన్నించి మరో 14 రోజులు వారి కస్టడీకి ఇస్తే.. సుమారు 28 రోజుల పాటు చిదంబరం విచారణ సంస్థల కస్టడీలోనే ఉండక తప్పదు. ఒకవేళ సీబీఐ, ఈడీలకు చెరో వారం చొప్పున కస్టడీకి ఇచ్చినా కనీసం 15 రోజుల పాటు ఆయనకు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదు.