Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహాశివరాత్రి వచ్చేస్తోంది. శైవక్షేత్రాలన్నీ ఈ అరుదైన రోజు కోసం సర్వసన్నద్ధం అవుతున్నాయి. ఒక్కో క్షేత్రానిది ఒక్కో ప్రాశస్త్యం. అలాంటి వాటిలో విశిష్టం అయిన చీకటి మల్లయ్య స్వామి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకీ చీకటి మల్లయ్య స్వామి ఆలయం ఎక్కడో సుదూరాన లేదు. ఆంధ్రప్రదేశ్ , గుంటూరు జిల్లా , కారంపూడి దగ్గరలో వుంది . ఆ ఆలయం వున్న ప్రాంతాన్ని గుత్తికొండ బిలంగా పిలుస్తారు.ఈ బిలం దగ్గర వాతావరణం ప్రకృతి ప్రేమికులకు ఓ వరం. చిన్నచిన్న కొండలు , సెలయేళ్లు, రామచిలుకల ధ్వనులు …ఇలా ప్రకృతి కాంత సౌందర్యం మూటగట్టి ఈ ప్రాంతాన్ని సృష్టించారు అన్నట్టు ఉంటుంది. ఇక్కడకి వేసవిలో వెళితే చల్లగా ఉంటుంది ..చలికాలంలో వెళితే వెచ్చగా ఉంటుంది.ఇక గుత్తికొండ బిలం ఏర్పడిన తీరు చూస్తే ఇది ఆ దేవుడు చేసిన అద్భుతం అనుకోక తప్పదు.
ఇది ద్వాపర యుగానికి ముందు నుంచి ఉన్నట్టు చెప్పుకుంటారు. ఆ యుగంలో శివుని పూజించిన కాలయముడు అనే రాక్షసుడు ఆ భోళా శంకరుడు ఇచ్చిన వరాన్ని ఆధారం చేసుకుని యాదవ రాజులను బాగా ఇబ్బందిపెట్టాడట. అతని బారి నుంచి యాదవుల్ని రక్షించడానికి పూనుకున్న శ్రీకృష్ణుడు అతన్ని అంతం చేయడానికి గుత్తికొండ బిలాన్ని ఎంచుకున్నాడట. ఇక్కడ ముచికుందుడు అనే మహాముని వందల సంవత్సారాల పాటు తపస్సు చేసి ఎన్నో శక్తులు కూడగట్టుకున్నాడట. ఈ బిలంలోనే ఆయన తపస్సు చేసుకునేటప్పుడు కాలయముడు వచ్చేలా కృష్ణుడు వ్యూహం రూపొందించాడట. అలాగే అక్కడికి వచ్చిన కాలయముడు చీకటిలో కృష్ణుడు ఉత్తరీయం మీద పడిన ముచుకుందుడుని చూసి కృష్ణుడు అనుకుని మీదకు వెళతాడు. తపస్సు భంగం అయిన ముచుకుందుడు ఆ రాక్షసుడిని అంతమొందిస్తాడు. ఇదే గుత్తికొండ బిలంలో 1182 ప్రాంతంలో పల్నాటి యుద్ధ సమయాన కన్నమదాసు లాంటి యోధులతో కలిసి బ్రహ్మనాయుడు ఇక్కడే ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక యుద్ధం తర్వాత వైరాగ్యం వచ్చిన బ్రహ్మనాయుడు ఇక్కడే తపస్సు చేసుకుంటూ శివైక్యం పొందారని చెప్పుకుంటారు.
ఇంతటి విశిష్టత వున్న ఈ బిలంలో శివయ్య చీకటి మల్లయ్య గా స్వయంభువుగా అవతరించాడు. ఈ చీకటి మల్లయ్యను దర్శించుకున్నవారికి కోరిన కోరికలు మొత్తం తీరతాయని చెప్పుకుంటారు. ఇక్కడ మొత్తం 108 బిలాలు వున్నాయి. వీటిలో ఓ 8 బిలాలు లోపలి మనుషులు వెళ్ళడానికి వీలుంటుంది. మిగిలిన వాటిలోకి వెళ్లే అవకాశం ఉండదు. అయితే ఆ గుహల నుంచి ఓం నమశ్శివాయ మంత్రం వినిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఓంకార నాదం కూడా వినిపిస్తుంది . కొందరు మునులు ఇప్పటికీ తపస్సులో ఉన్నట్టు చెప్పుకుంటారు. ఈ బిలాలు లోపలికి వెళితే ఓ చోట 101 శిరస్సుల నాగేంద్రస్వామి , పెద్ద పుట్ట , అక్షయ పాత్రలో గరళం తాగుతున్న శివయ్య విగ్రహాలు కనిపిస్తాయట. పైగా ఓ దివ్యకాంతి శివుడి విగ్రహం మీద పడుతూ వుంటుందట. ఈ బిలాల నుంచి కాశి , చేజెర్ల , అమరావతి ,తిరుపతి , అహోబిలం లాంటి పుణ్య క్షేత్రాలకు రహస్య మార్గాలు వున్నాయట. ఇక ఇక్కడ వున్న చిన్నచిన్న నీటి ఊటలు ఎప్పుడూ ఇంకిపోవు. వీటిలో స్నానం చేస్తే లక్షమందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుందట.