Children Should be Loved
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ చిన్నారి తన పుస్తకంలోని 1 నుంచి 5 అంకెలను సరిగ్గా చదవటం లేదన్న కారణంతో వాళ్లమ్మ విపరీతంగా కొడుతుంటే… ఆ చిన్నారి కొట్టొద్దని వేడుకుంటూ…పెద్దగా ఏడుస్తూ..మళ్లీ మళ్లీ ఆ అంకెలను సరిగ్గా ఉచ్ఛరించటానికి ప్రయత్నిస్తున్న ఓ వీడియో ఇప్పుడు నెట్ లో విపరీతంగా షేర్ అవుతోంది. వీడియోలో ఆ చిన్నారి ఏడుపు చూసిన ప్రతి ఒక్కరికి హృదయం ద్రవించిపోతోంది. ముద్దులొలికే చిన్నారి కళ్ల వెంట కారుతున్న కన్నీళ్లు…దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి పడుతున్న బాధ చూసిన వాళ్లంతా..
పాప తల్లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కన్నతల్లి చదువు విషయంలో అయినా.. పిల్లలతో ఇంత కర్కశంగా ప్రవర్తించకూడదని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. సామాన్యులే కాదు..సెలబ్రిటీలు ఈ వీడియో చూసి తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు క్రికెటర్లు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప ఈ వీడియో పై స్పందించారు. తమ వ్యక్తిగత ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేసిన క్రికెటర్లు …
చిన్నారులను మనం ప్రేమించాలని కోరారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమాభిమానాలతో పాటు ఓర్పుగా ఉండాలని సూచించారు. ప్రతి చిన్నారికి సొంతంగా నేర్చుకునే గుణం ఉంటుందని, దాన్ని గౌరవిద్దామని, ఓర్పుగా నేర్పుదామని తల్లిదండ్రులను కోరారు. తల్లిదండ్రులు చిన్నారులెవరనీ కొట్టవద్దని, అనవసరంగా వారిపై కోపం ప్రదర్శించవద్దని క్రికెటర్లు సూచించారు. మన క్రికెటర్లు అయితే ఇలా సునిశిత విమర్శలు, సలహాలతో సరిపెట్టారు కానీ…సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు చిన్నారి తల్లిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమెకు తల్లి అయ్యే అర్హత లేదని, ఆమెను నార్వే పంపించి ఆ చిన్నారికి విముక్తి కల్పించాలని ఆగ్రహిస్తున్నారు.