డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై తీవ్ర విమర్శలు

డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై తీవ్ర విమర్శలు

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి గాను చైనా ఈ వైరస్‌ను వదిలిందని అమెరికా వాదన. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్‌ మ​రోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అలా చేయలేదని ట్రంప్‌ ఆరోపించారు.

ఈ సం‍దర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఇది చైనా నుంచి వచ్చింది. వైరస్‌ బయటకు వ్యాపించకుండా వారు ఆపేయవచ్చు. కానీ అలా చేయలేదు. తమ దేశంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. కానీ మిగతా ప్రపంచానికి వ్యాపించకుండా కట్టడి చేయలేకపోయారు. కావాలనే ఇలా చేశారు. యూరోప్‌కు వ్యాపించింది.. తర్వాత అమెరికా. వారు మాకు ఎప్పుడు వ్యతిరేకమే. వారు పారదర్శకంగా లేరు. ఇది మంచి పద్దతి కాదు’ అని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా గురించి ట్రంప్‌ సోమవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫట్టా అల్ సిసితో మాట్లాడారు.

‘ప్రస్తుతం ప్రపంచమంతా కలసికట్టుగా ఉండాల్సిన సమయం. గత రెండు వారాలుగా నేను పలువురు ప్రపంచ అధ్యక్షులతో మాట్లాడుతున్నాను. మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. మంచి స్థితిలో ఉన్నామని ఎవరు భావించకూడదు. ఇది అకస్మాత్తుగా వచ్చి మన మీద పడుతుంది’ అని ట్రంప్‌ హెచ్చరించారు. అంతేకాక ప్రస్తుతం అమెరికా చాలా దేశాలకు సాయం చేస్తోందని తెలిపారు. కొన్ని దేశాలకు వెంటిలేటర్లు లేవు.

దాంతో వేలాది వెంటిలేటర్లను వివిధ దేశాలకు పంపుతున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ చైనా వల్లే వచ్చిందని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. అంతేకాక రానున్న వారాలు మరింత భయంకరంగా ఉండబోతున్నాయన్నారు ట్రంప్‌. దేశాలన్ని దారుణమైన పరిస్థితులను చవి చూస్తాయన్నారు. కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్‌లు, చికిత్స విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నాము అన్నారు ట్రంప్‌.

ఇందుకు గాను గతంలో మంచి విజయాలను సాధించిన కంపెనీలను తాను తీసుకురాబోతున్నట్లు ట్రంప్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తయారి విషయంలో తాము చాలా బాగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 మిలియన్ల మంది కరోనా వైరస్‌ బారిన పడితే.. అందులో సుమారు 4 మిలియన్ల మంది అమెరికన్లే ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6 లక్షలు ఉండగా వీటిలో అత్యధికంగా అమెరికాలో 1,43,000 మరణాలు చోటు చేసుకున్నాయి.