చైనాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్‌లో ఒమిక్రాన్ కేసులను గుర్తించిన అనంతరం లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చైనాలో లాక్డౌన్ విధించిన మూడో నగరమిది.
కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నియంత్రించడంలో భాగంగా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అన్యాంగ్ నగరంలోని ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు సూచించారు. నగరవాసుల వాహనాల వినియోగాన్ని నిషేధించారు. సోమవారం ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ సోకగా, మంగళవారం మరో 58 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు జియాన్, యుజౌవు నగరాలను చైనా లాక్‌డౌన్‌తో దిగ్భంధించిన విషయం తెలిసిందే.