Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉగ్రవాదంపై పోరులో పాక్ చేసిన త్యాగం చాలా గొప్పది. దీన్ని ప్రపంచదేశాలు గుర్తించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని తరిమికొట్టడంలో పాక్ కీలక పాత్ర పోషిస్తోంది. వినడానికే హాస్యాస్పదంగా ఉన్న ఈ వ్యాఖ్యలు చేసింది పాకిస్థాన్ ప్రభుత్వమో, ఆ దేశ పౌరులో కాదు. బ్రిక్స్ దేశాల సదస్సులో పాక్ ఉగ్రవాదసంస్థల పేర్లను ప్రస్తావించిన తీర్మానంపై సంతకం చేసిన చైనా. ఉగ్రవాదంపై పాకిస్థాన్ తన బుద్దిని ఎలా మార్చుకోదో… పాక్ తో అనుసరించే విధానంపై చైనా కూడా అలాగే తన వైఖరి మార్చుకోదు అన్న విషయం మరోమారు రుజువయింది. పాకిస్థాన్ తో చెలిమి విషయంలో అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చైనా వాటిని లెక్కచేయదు. మొన్నటికి మొన్న బ్రిక్స్ దేశాల సదస్సులో తొలిసారిగా పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థల పేర్లను ప్రస్తావిస్తూ చేసిన తీర్మానంపై తప్పనిసరై సంతకం చేసిన చైనా కొన్ని రోజులకే తన వైఖరి బహిర్గతం చేసింది.
బ్రిక్స్ సదస్సు డిక్లరేషన్ పై చైనా కూడా సంతకం చేయటంతో పాక్ తో ఆదేశానికి ఉన్న మితృత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టయిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషించారు. కానీ చైనా మాత్రం సదస్సు ముగిసీ ముగియగానే పాకిస్థాన్ ను వెనకేసుకు రావటం మొదలుపెట్టింది. చైనా, పాక్ ఎప్పటికీ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉంటాయని, ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడుతోందని చైనా ప్రతినిధులు చెప్పారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ చైనాలో పర్యటించిన సందర్భంగా మరోసారి తమ దేశాల మైత్రీ బంధంపై పాక్ లో చైనా రాయబారి సున్ వీడాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ కు సంబంధించినంతవరకు చైనా విధానాల్లో ఎలాంటి మార్పూఉండబోదని ఆయన స్పష్టంచేశారు. ప్రాంతీయ లక్ష్యాలను ఎదుర్కోవడంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. బ్రిక్స్ తీర్మానం తమ దేశాల మధ్య స్నేహానికి ఎలాంటి ఆటంకాలు కల్పించబోదని, తీర్మానంలో ప్రస్తావించిన ఉగ్రవాద సంస్థలన్నింటినీ పాకిస్థాన్ ఎప్పుడో నిషేధించిందని సున్ వీడాంగ్ చెప్పొకొచ్చారు.
పాకిస్థాన్ స్తోత్రంలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ అయితే ఇంకో అడుగు ముందుకేశారు. ఉగ్రవాదంపై పోరులో పాక్ చేసిన త్యాగం చాలా గొప్పదని, దీన్ని ప్రపంచదేశాలు గుర్తించాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని తరిమికొట్టడంలో పాక్ కీలక పాత్ర పోషిస్తోంది అని వ్యాఖ్యానించటం ద్వారా… ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా…పాకిస్థాన్ ను ఎల్లవేళలా తాము సమర్థిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. ఇటీవల చైనా లోని షామన్ లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాదసంస్థల పేర్లనను తొలిసారిగా ప్రస్తావించారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, నిర్వహించేవారిని, మద్దతుతెలిపే వారిని జవాబుదారీగా చేయాలని బ్రిక్స్ తీర్మానం స్పష్టంచేసింది. ఈ తీర్మానం తరువాత అయినా ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరి మారుతుందని…చైనా కూడా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తుందని అంతా భావించారు.కానీ ఎప్పటిలానే చైనా పాత పాటే పాడింది.
మరిన్ని వార్తలు: