చైనా చేష్టలు మరోసారి గుట్టు రట్టు… సీక్రెట్‌గా నావికా స్థావరం..

చైనా.. భారత్ ను కవ్విస్తూనే ఉంది. భారత సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరించి.. కవ్వింపులకు పాల్పడుతుంది చైనా. అలాగే.. చైనా తన యుద్ధతంత్రాలకు మరింత పదునుపెట్టింది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించేలా.. పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టులో రహస్యంగా ఓ నావికా స్థావరాన్నే ఏర్పాటు చేసుకుంది.  పాకిస్తాన్-చైనా ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా కూడా పాక్-ఇరాన్ సరిహద్దులోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక అవసరాల కోసం మాత్రమే ఆ పోర్టును వాడుకుంటామని బుకాయిస్తోన్న డ్రాగన్.. అక్కడ సైనిక స్థావరాన్ని నిర్మిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా వైమానిక, రక్షణ రంగాలకు సంబంధించి కీలక కథనాలను ప్రచురించే ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ తాజా సంచికలో చైనా గుట్టును ఆధారాలతో సహా బయటపెట్టింది. పాకిస్తాన్ ఆధీనంలోని గ్వాదర్ పోర్ట్ కు సమీపంలో 2281 ఎకరాల భూమిని 48 ఏళ్ళకు లీజ్ తీసుకున్న చైనా.. అక్కడ చేపడుతోన్న నిర్మాణాల్లో ఓ హైసెక్యూరిటీ బిల్డింగ్ కూడా ఉందని.. శాటిలైట్ చిత్రాల విశ్లేషణను బట్టి అది కచ్చితంగా నావికా స్థావరమే అయి ఉంటుందని కూడా ఫోర్బ్స్ స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్వాదర్ పోర్టులో చైనా నిర్మాణాలన్నీ ఎక్కువగా ప్రైవేటు కంపెనీలవి కాగా.. ప్రత్యేకంగా నిర్మిస్తోన్న బిల్డింగ్ ను మాత్రం ‘చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ(సీసీసీసీ లిమిటెడ్) చేపట్టిందని.. సదరు కంపెనీ నేరుగా జిన్ పిన్ ప్రభుత్వాధీనంలోనే పనిచేస్తున్నది ఫోర్బ్స్ వాదన. అలాగే.. లోపల ఏం జరుగుతోందో కనిపించకుండా ఆ బిల్డింగ్ చుట్టూ అంచెల వారీగా ఎత్తైన ప్రహారీలు నిర్మించారని.. శాటిలైట్ చిత్రాలను బట్టి లోపల యాంటీ వెహికల్ బెర్మ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడవుతోందని తెలిపింది. ఇంకా హైసెక్యూరిటీ బిల్డింగ్ కు సమీపంలోనే మరో రెండు టవర్లను గతంలోనే నిర్మించారని.. 2017లో అక్కడ చైనీస్ మెరైన్ల కదలికలు కనిపించాయని, నిర్మాణాల డిజైన్ ను బట్టి… చూస్తే.. అవి సైనిక స్థావరాలే అయి ఉంటాయని తెలుస్తోంది. కాగా ఇప్పటికే కార్యకలాపాలు ఆరంభమైన గ్వాదర్ పోర్టులో చైనా నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్నట్లు డిఫెన్స్ నిపుణులు పేర్కొన్నారు. గ్వాదర్ పోర్టు గుండా గత వారం అఫ్ఘానిస్తాన్ 17,600 టన్నుల ధాన్యాన్ని సరఫరా చేసినట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లే సీపెక్ ప్రాజెక్టును భారత్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

కాగా భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న ఈ సమయంలో అక్కడి వాస్తవ పరిస్థితిని దేశ ప్రజలకు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చైనా ఆర్మీ భారత్ లోకి అడుగుపెట్టలేదనే విషయాన్నైనా ధృవీకరించాలని.. ప్రభుత్వం మౌనంగా ఉండిపోతే ఊహాగానాలు మరింతగా పెరిగిపోతాయని రాహుల్ వివరించారు. వీలైనంత తొందరగా టెన్షన్ తగ్గించే చర్యలు చేపట్టాలని రాహుల్ తెలిపారు. అయితే వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి దగ్గరలో భారత్ తన భూభాగంలో రోడ్లు, వంతెనలు నిర్మించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందులో భాగంగా మే నెల ప్రారంభం నుంచి తరచూ గొడవలకు దిగుతూనే ఉంది. అలాగే.. భారీగా సైన్యాన్ని.. ఆయుధ సంపత్తిని పోగుచేసుకుంటుంది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని భారత్ వెల్లడిస్తున్నా కానీ… కీలక చర్చలు జరుపుతూనే కవ్వింపులు మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే పలు దఫాలగా చర్చలు జరిగినా కానీ ఓ కొలిక్కి రాలేదు. అయితే ఈనెల 6వ తేదీన మరోమారు లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో కీలక భేటీ జరగనుంది. ఈ భేటీలో అయినా సమస్యకు తగిన పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది వేచి చూడాలి.