అమెరికాలో మహాత్ముడి విగ్రహం ధ్వంసం… క్షమాపణలు..

అమెరికా అట్టుడుకుతోంది. కొద్దిరోజులుగా అగ్రరాజ్యంలో జాత్యహంకార వ్యతిరేక దాడులు జరుగుతున్నాయి. దీంతో  ఆ దాడులు కాస్తా జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వరకు వచ్చాయి. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ప్రదర్శనలను చేపడుతోన్న ఆందోళనకారులు మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జాత్యహంకారానికి, జాతి వివక్షకు వ్యతిరేకంగా ఏకంగా స్వాతంత్య్ర ఉద్యమాన్నే నడిపించిన గాంధీ విగ్రహాన్ని ఆందోళనకారులు అగౌరవపరిచారు. దీనిపై అమెరికా ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వెంటనే క్షమాపణలు కూడా చెప్పింది.

అయితే జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా కొద్దిరోజులుగా అమెరికాలో నిరసనజ్వాలలు ఎగచిపడుతున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోన్న నల్ల జాతీయులు తాజాగా రాజధాని వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. అమెరికాలో 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ స్మారకార్థం నిర్మించిన కట్టడాన్ని ధ్వంసం చేశారు. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన స్మారక చిహ్నాన్ని కూల్చివేశారు. అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక చర్చిపైన కూడా దాడులు జరిపారు.

అంతేకాకుండా వాషింగ్టన్‌లోని భారత రాయాబార కార్యాలయం ఎదురుగా ప్రతిష్ఠించిన మహాత్మా గాంధీ విగ్రహంపై కూడా తమ ప్రతాపాన్ని చూపారు. గుంపులు గుంపులుగా వచ్చిన నల్ల జాతీయులు రాళ్లు, ఇతర వస్తువులను దాడులు చేయడంతో మహాత్ముడి విగ్రహం ధ్వంసమైంది. విగ్రహం శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో రాయబార కార్యాలయం అధికారులు వెంటనే శకలాలను తొలగించారు. మహాత్ముడి విగ్రహాన్ని తెల్లటి వస్త్రంతో కప్పారు. కాగా ఈ ఘటన పట్ల అమెరికా ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారత్‌కు క్షమాపణ చెప్పింది. మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం కావడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత్‌లోని అమెరికా రాయబారి కెన్ జస్టర్ తెలిపారు. ఈ ఘటన పట్ల తాము చింతిస్తున్నామని అన్నారు. క్షమాపణలు కోరుతున్నామని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఇప్పటికే తమ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని  కూడా వివరించింది.