వెంటాడిన మృత్యువు: కరోనా భయంతో సొంతూరుకు.. ఆపై

తెలంగాణలో ఘోరం జరిగింది. కరోనా భయంతో నగరం నుంచి సొంతూరెళ్లిన ఓ వ్యక్తి పిడుగు పాటుకు గురై మృత్యవాత పడ్డాడు. స్థానికులతో కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. వేంసూరు మండలం దుద్దేపూడికి చెందిన నంద్యాలకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు లక్ష్మణరావు ఉన్నారు. కొడుకు హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌ విధించడంతో హైదరాబాద్‌లో ఉండిపోయిన లక్ష్మణరావు కొద్ది రోజుల క్రితమే సొంత ఊరు వెళ్లాడు.

అయితే సరదాగా స్థానిక చెరువులో చేపల పట్టేందుకు కొందరు ఊర్లోని స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాసేపటికే ఇంటికి వెళ్దామనుకున్నాడు. కానీ.. ఇంతలోనే ఆ చెరువు సమీపంలో పిడుగుపడింది. ఆ పిడుగు దెబ్బకు లక్ష్మణరావు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. మిగిలినవారు ఆ ప్రదేశానికి దూరంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అప్పటి వరకు కళ్ల ముందు తిరిగిన కుమారుడు ఇలా విగతి జీవిగా పడి ఉండటాన్ని చూసిన ఆ కుటుంబం బోరుమని విలపించింది. ఆ ఊరంతా విషాద ఛాయలు అలముకున్నాయి.