మెత్తబడ్డ ఆమంచి…కధ కంచికే…!

Chirala Mla Amanchi Krishna Mohan To Meet With Chandrababu On Wednesday

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. టికెట్ హామీ, పార్టీల్లో ప్రాధాన్యత దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. కొందరు ధైర్యం చేసి గోడ దూకేస్తుంటే మరికొందరు టికెట్ హామీల కోసం ఎదురు చూస్తున్నారు. మొన్న రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీ గూటికి చేరిపోగా రెండు రోజులుగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి పేరు కూడా వైసీపీ గూటికి చేరతారని గట్టిగా వినిపిస్తోంది. ఆమంచి మంగళవారం అనుచరులతో కూడా సమావేశం కావడంతో టీడీపీ వీడటం ఖాయమని భావించారు. వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం.. పార్టీ దూతగా మంత్రి శిద్ధా రాఘవరావును కృష్ణ మోహన్ దగ్గరకు పంపింది. పార్టీని వీడొద్దంటూ సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి లోకేష్‌తో ఫోన్‌లో మాట్లాడించి సీఎంను కలవాలని ఆమంచికి శిద్దా సూచించారు. దీంతో కాస్త మెత్తబడ్డ కృష్ణ మోహన్ బుధవారం అధినేత చంద్రబాబును కలిసేందుకు సిద్ధమయ్యారు.

ఆమంచి కృష్ణ మోహన్ 2014కు ముందు చీరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కొద్దిరోజులుగా ఆమంచి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని జిల్లాలో చర్చ నడిచింది. జనసేనవైపు చూస్తున్నారని.. పవన్ కళ్యాణ్‌ను కూడా కలిశారని ప్రచారం జరిగింది. తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టినా జిల్లా నాయకత్వం స్పందించకపోవడం జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని కృష్ణ మోహన్ అసంతృప్తితో ఉన్నారట. ఆమంచి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలపై అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన ఓ నిర్ణయం తీసుకుందామని అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విశ్లేషకులు.