Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘2.0’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. మరో వైపు ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ సభ్యులు కోట్లు ఖర్చు చేసి చేస్తున్నారు. ఇటీవలే దుబయిలో భారీ ఎత్తున ఈ చిత్రం ఆడియో వేడుకను నిర్వహించిన చిత్ర యూనిట్ సభ్యులు త్వరలో టీజర్ మరియు ట్రైలర్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి రెండవ వారంలో భారీ వేడుక నిర్వహించేందుకు శంకర్ ఏర్పాట్లు చేస్తున్నాడు. హైదరాబాద్‌లో జరగబోతున్న వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు.
కొన్ని సంవత్సరాల క్రితం శంకర్, రజినీకాంత్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో రోబో చిత్రానికి భారీ పబ్లిసిటీ దక్కింది. అందుకే ‘2.0’ చిత్రం ప్రమోషన్లో కూడా చిరంజీవిని వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో శంకర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రజినీకాంత్‌పై ఉన్న అభిమానంతో పాటు స్నేహంతో తప్పకుండా చిరంజీవి ‘2.0’ చిత్రం ప్రమోషన్లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవితో దర్శకుడు శంకర్ ఈ విషయం గురించి చర్చించినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అయితే సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.