మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఏర్పరచుకున్న అతి సామాన్య వ్యక్తి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇంటికి పెద్దకొడుకుగా బాధ్యతగా ఇద్దరు తమ్ముళ్ళని, ఇద్దరు చెల్లెళ్ళని పైకి తీసుకొచ్చాడు. తల్లిదండ్రుల్ని గొప్పగా చూసుకున్నాడు. తనకున్న పరిమితుల్లో, తన బలాన్ని, స్కిల్స్‌ని వినియోగించుకుంటూ సినిమాల్లో మెగాస్టార్ అయ్యాడు. తన అణకువతో బావమరిదిని, పిల్లనిచ్చిన మామని తనకి అండగా మలుచుకున్నాడు. ఇలా ఇన్ని చేసిన చిరు ఒకే ఒక్క తప్పు చేసాడు. అదేంటంటే రాజకీయంలో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఊహించుకుని అదే స్థాయిలో తానూ కూడా చక్రం తిప్పగలను అని అనుకుని బొక్క బోర్లా పడడం. ఒక మెగాస్టార్ గా నెత్తిన పెట్టుకున్న అభిమానులు సైతం చిరంజీవి రాజకీయ జీవితాన్నిచూసి ఆయన అభిమానమే వదులుకునేలా చేశాయి.
ఉభయ రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కొంతకాలం పాటు కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఇప్పుడు పదవీ కాలం పూర్తవడంతో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి సోదరుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీలో ఆయన చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన జనసేన గూటికి చేరాలనే, ముందుగా తన మందీ మార్బలాన్ని జనసేన గూటికి చేర్చారని తెలుస్తోంది. ప్రభుత్వంలో కీలకమయిన కేంద్రమంత్రి పదవిలో పనిచేసి ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగాలని భావిస్తూ అందుకు తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన జనసేనలోకి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పాలని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
నిన్న మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేనలో చేరారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన మెగాస్టార్ అభిమానులు ఈ సందర్భంగా పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ‘చిన్ననాటి నుంచే నాకు చిరంజీవి హీరో. ఆయన సినిమాల్లో హీరో అయినందుకు కాదు. అతిసామాన్య కుటుంబంలో పుట్టి, కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నందుకు. నేనూ చిరంజీవి అభిమానిని కాబట్టే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ప్రత్యేకంగా ఏదీ పెట్టలేదు. చిరు మీద మాట పడితే ఊరుకునేవాణ్ని కాదు నేను. ఇప్పటికీ ఆయనపై అదే గౌరవం, ప్రేమ ఉన్నాయి’ అని పవన్ చెప్పుకొచ్చారు. తన సోదరుడు చిరంజీవి మాటను జవదాటేది లేదని, ప్రజా రాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించినప్పటికీ అందులో పనిచేసిన నాయకులు జవాబుదారితనంతో లేకపోవడంవల్లే ఇబ్బందులు వచ్చాయని ప్రజారాజ్యం సమయంలో తాను ఒక నాయకుడిగా మాత్రమే పనిచేస్తానని చెప్పానని, ప్రజా సమస్యలను పట్టించుకునేవారు లేకపోవడంతోనే ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించాల్సి వచ్చిందని పవన్ చెప్పారు.
‘నాకు నేను ఎప్పుడూ హీరోలా అనుకోలేదు. అన్నయ్యను, అమితాబ్‌ను మాత్రమే హీరోగా అభిమానించా. అన్నయ్య తిరిగి సినిమాల్లోకి వెళ్లిన తర్వాత అభిమానులంతా మరి రాజకీయంగా ఏం చేయమంటారు అంటే మీ ఇష్టం అన్నారు. ఈ రోజు ఇంతమంది ప్రేమాభిమానాలతో జనసేనలో చేరినందుకు ఆనందంగా ఉంది. పెద్ద మనసు చేసుకొని జనసేనకు మద్దతు ఇచ్చిన మెగా అభిమానులకు కృతజ్ఞతలు’ అని పవన్ అన్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని బట్టి చూస్తుంటే చిరంజీవి జనసేనలో చేరి కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి ఇంచార్జ్ గా నియమించబడ్డ ఉమెన్ చాందీ హైదరాబాద్ వచ్చిన సమయంలో చిరంజీవి ఆయనతో సమావేశం కాకపోవడం కూడా ఈ వాదనకు మరింత బలం ఇస్తోంది. అయితే ఈ పరిణామాల మీద ఎటువంటి అధికారిక ప్రకటనా చేయకపోవడంతో మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.