Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కోన వెంకట్ సలహామేరకు జనవరి 16 కోసం ఎదురుచూస్తూ నాలుగైదురోజులుగా కత్తి మహేశ్ మౌనంగా ఉంటున్నప్పటికీ… పవన్ ఫ్యాన్స్ కు, ఆయనకు నడుమ తలెత్తిన వివాదం సద్దుమణుగుతుందన్న నమ్మకం ఎవరికీ కలగడం లేదు. పవన్ దిగివచ్చి ఆయన అభిమానులను కంట్రోల్ చేస్తేనే ఈ వివాదం ముగుస్తుందని హెచ్చరించిన కత్తి మహేశ్ కోన వెంకట్ మధ్యవర్తిత్త్వాన్ని అంగీకరిస్తాడా అన్నది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న సందేహం. అయితే సినీరంగాన్ని, అభిమానులను కుదిపేస్తున్న ఈ వివాదానికి తెరపడడానికి తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఓ సలహా ఇచ్చారు. ఈ వివాదానికి తక్షణమే ముగింపు పలకడానికి మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు.
చిరంజీవిపై గతంలో హీరో రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇలాగే అభిమానులు దాడులకు దిగారని, ఆ సందర్భంలో చిరంజీవి హుందాగా వ్యవహరించి రాజశేఖర్ ఇంటికెళ్లి పరామర్శించి ఒక మంచి సంస్కృతి నెలకొల్పారని ఆయన గుర్తుచేశారు. అదే తరహాలో పవన్, కత్తిమహేశ్ వ్యవహారంలో కూడా చిరంజీవి ఒక పెద్దమనిషిగా జోక్యం చేసుకుని వివాదాన్ని ముగించాలని కోరారు. ఇలాంటి విషయాలను రాజకీయాలతో ముడిపెట్టకుండా పవన్ అభిమానులు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.