అల్లుడు కోసం చిరు ఆరాటం…!

Chiru Special Care On Sai Dharam Tej Movie

మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఎంట్రీ ఇచ్చి, పలు సక్సెస్‌లను దక్కించుకుని, మామ పోలికలు ఉన్నాయి, కచ్చితంగా స్టార్‌ అవుతాడు అనేంతగా పాపులర్‌ అయ్యాడు. కానీ ఆ తర్వాత కాస్త దూకుడు ప్రదర్శించి కథలను ఎంపిక చేసుకోవడంలో పొరపడి వరుస ఫ్లాపులను చవి చూశాడు. ఇక వరుస చిత్రాలు ఫ్లాపు అయితే మనోళ్ల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. దాంతో చేసేది లేక కాస్త విరామం తీసుకున్న తేజూ ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘చిత్ర లహరి’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ హీరోయిన్‌ కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమయిన ఈ చిత్రం ఫలితం తేజూకు చాలా అవసరం. దాంతో ఈ చిత్రం కోసం తేజూ చాలా కష్టపడుతున్నాడు.

chitrala-hari

తేజూ మాత్రమే కాకుండా మామయ్య చిరంజీవిని కూడా రంగంలోకి దించాడు. సహజంగా చిరు షూటింగ్‌ మొత్తం పూర్తయ్యాక ఎడిటింగ్‌ సమయంలో వచ్చి కొన్ని సలహాలు సూచనలు ఇస్తాడు. కానీ ఈ చిత్రం కోసం చిరు మొదటి నుండే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథ మొత్తం చిరు పరిశీలించి కొన్ని మార్పులు చేస్తున్నాడు. స్క్రిప్టు విషయంలో చిరు చాలా మార్పులు చేసినట్టు సమాచారం. ఇది తేజూ కెరియర్‌కు చాలా అవసరం కాబట్టి చిరు అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకున్న అనుభవంతో ఈ చిత్రాన్ని సక్సెస్‌ అయ్యేలా కొన్ని పాయింట్లను కూడా కలిపినట్టు తెలుస్తోంది. మొత్తానికి తేజూకు మంచి సక్సెస్‌ అందాలని చిరు చాలా ఆరాట పడుతున్నాడు. చిరు ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్నాడు.

sai-dharam-tej-movies