తమిళనాడులో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. అదేమంటే.. సిగరెట్ అప్పుగా కాదన్నాడని.. ఏకంగా టీ దుకాణానికే నిప్పు పెట్చేశాడు ఓ ఆకతాయి. తమిళనాడులోని మదురై జిల్లా నాగమలై పుదుకోట్టై సమీపంలోని అచ్చంబత్తు ప్రాంతానికి చెందిన భూమినాథన్ స్థానికంగా టీ దుకాణం నడుపుతున్నాడు. బుధవారం రాత్రి టీ దుకాణంలో మంటలు వ్యాపించాయి. ఫైరింజన్ వచ్చేసరికే స్థానికులు కొంతమేర మంటలు ఆర్పేశారు. అయితే వారిలో గుణశేఖర్ అనే వ్యక్తి కూడా మంటలు ఆర్పడంలో సాయం చేశాడు. మొత్తానికి అగ్నిమాపక సిబ్బంది సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
కాగా ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు చేయడంతో నాగమలై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయం కనిపెట్టారు. టీ దుకాణానికి ఓ వ్యక్తి నిప్పు పెడుతున్న దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు స్థానికంగా ఉండే గుణశేఖర్ అనే వ్యక్తి అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించారు. దీంతో భూమినాథన్ తనకు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని.. ఆ కోపంతోనే టీ దుకాణానికి నిప్పు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అతడిపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.