తనకు తెలియకుండా కీలకమైన డాటా చోరీ చేశాడంటూ ఓ సినీ నటి ఒక వ్యక్తి మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ కాలనీలో ఉంటున్న సినీ నటి, సామాజిక కార్యకర్త రాధాప్రశాంతికి గత నాలుగేళ్లుగా ప్రముఖ డిజైనర్ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో లక్ష్మి తన కుమారుడు చక్రితో కలిసి చీరల డిజైన్లు చూపడానికి ఇటీవల రాధాప్రశాంతి ఇంటికి వచ్చింది. మే 13న ఆమె ఇంటికి వచ్చిన చక్రి తన ల్యాప్‌టాప్‌లోని చీరల డిజైన్లు రాధాప్రశాంతి సెల్ఫోన్లోకి పంపుతానని చెప్పగా వాట్సాప్ ద్వారా పంపాలని ఆమె సూచించింది. సెల్‌ఫోన్ పని చేయడం లేదని చెప్పిన అతను ఆమె సెల్‌ఫోన్ తీసుకొని గంటన్నర తర్వాత తిరిగి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆమె తన సెల్ఫోన్లో చూసుకోగా అందులో ఎలాంటి డిజైన్లు కనిపించలేదు. దీంతో చక్రికి ఫోన్ చేయగా వస్తానని చెప్పి తప్పించుకున్నాడు. అతడి తల్లికి ఫోన్ చేయగా ఆమె నుంచి సరైన సమాధానం లేదు. దీనికితోడు లక్ష్మి జీఎస్టీ కార్డు ఇస్తానని ప్రశాంతికి చెందిన బ్యాంకు వివరాలు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రూ. 25 వేల నగదును తీసుకుంది. తన కుమారుడిని తీసుకొని వస్తానని చెప్పిన ఆమె ఇప్పటి వరకు రాకపోగా తన జీమెయిల్లోని డాటా మొత్తం కనిపించడం లేదని అందు లో ఫేస్బుక్లో ఉండాల్సిన ముఖ్యమైన ఫొటోలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటితో పాటు ముఖ్యమైన ఫైళ్లు కనిపించడం లేదని లక్ష్మితో పాటు ఆమె కుమారుడు చక్రిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.