వైసీపీ జెండా మీద బాబు ఫోటో…చిత్రం భళారే విచిత్రం.

ck-babu-photo-on-ysrcp-flag

రాజకీయాల్లో చిత్రాలకు కొదవలేదు. లోక్ సభ స్థాయిలో ఎప్పుడో టీడీపీ గొడుగు కిందకు చేరిన కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక కి వైసీపీ కోటాలో స్పీకర్ నుంచి పిలుపు రావడం చిత్రం అనుకుంటే అంతకు మించిన విచిత్రానికి చిత్తూర్ జిల్లా వేదిక అయ్యింది. జిల్లా కేంద్రం చిత్తూర్ లో వైసీపీ జెండాలు బాబు గారి ఫొటోలతో రెపరెపలాడుతున్నాయి. అయితే ఆ బాబు చంద్రబాబు కాదు.చంద్రబాబు అంటే మండిపడే మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. బీజేపీ లో చేరిన ఈయన ఫోటో వైసీపీ జెండా మీదకు ఎందుకు వచ్చిందన్నదే కదా మీ సందేహం. ఆ విషయం తెలియాలంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే.

సీకే బాబు , వై ఎస్ కి ముఖ్య అనుచరుడు అని చిత్తూర్ జిల్లాలో చిన్నపిల్లోడిని అడిగినా చెబుతారు. పెద్దిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఎప్పుడూ వై.ఎస్ వ్యతిరేక వర్గంలో ఉండేవారు. అయితే జగన్ , మిదున్ ల స్నేహంతో వైసీపీ కి వచ్చేసరికి ప్రాధాన్యాలు మారిపోయాయి. వైసీపీ లో పెద్దిరెడ్డి హవా ముందు సీకే బాబు నిలవలేకపోయారు. అటు టీడీపీ లోకి వెళ్లే పరిస్థితులు లేవు. అందుకే మధ్యే మార్గంగా బీజేపీ లో చేరారు సీకే బాబు. అయితే ఆ పార్టీ జెండాతో ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవని బాబుగారికి కొద్దికాలంలోనే అర్ధం అయ్యింది. ఇక వైసీపీ లోకి తిరిగి రావాలని వున్నా పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే కనీసం చిత్తూర్ లో తన ప్రాబల్యం నిలుపుకోవాలంటే అక్కడ వైసీపీ గెలవకూడదు అని డిసైడ్ అయిపోయారు సీకే బాబు. అందుకే ఎవరినీ అడక్కుండా వైసీపీ జెండాని పోలిన జెండా మధ్యలో తన ఫోటో ముద్రించి సిటీ అంతటా పెట్టించారు.
ఈ వ్యవహారం స్థానిక వైసీపీ శ్రేణులకు మంట పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి టీం తో పాటు అక్కడ పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్న జంగాలపల్లి శ్రీనివాసులుకు తలనొప్పి తెస్తోంది. ఏ విధంగా అయినా వైసీపీ అధిష్టానం తనతో మాట్లాడాలన్న పట్టుదలతో సీకే బాబు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పార్టీలో లేని ఆయన్ని బుజ్జగించగడం ఎలాగో అర్ధం కాని వైసీపీ స్థానిక నాయకత్వం త్వరలో ఈ విషయాన్ని అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లబోతోంది.