రామానాయుడు తర్వాత దానయ్యే…

koratala siva praises DVV danayya

మహేష్‌బాబు హీరోగా నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించిన విషయం తెల్సిందే. 100 కోట్ల షేర్‌ను దక్కించుకున్న భరత్‌ అనే నేను చిత్రంతో నిర్మాతకు లాభాల పంట పండినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. దాదాపు 40 కోట్ల లాభాలు వచ్చినప్పటికి నిర్మాత దానయ్య మాత్రం హీరోయిన్‌ కైరా అద్వానీ మరియు దర్శకుడు కొరటాల శివలకు పూర్తి పారితోషికం ఇవ్వలేదని, అసలు పారితోషికం విషయంలో నిర్మాత దానయ్య ఎప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఇటీవలే దానయ్య మాట్లాడుతూ తాను హీరోయిన్‌ కైరాకు, కొరటాల శివకు పారితోషికం బాకీ ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అంటూ కొట్టి పారేశాడు. తాజాగా కైరా మరియు కొరటాలలు కూడా ఈ విషయమై స్పందించారు.

హీరోయిన్‌ కైరా అద్వానీ మాట్లాడుతూ తనకు నిర్మాత దానయ్య ఇవ్వాల్సిన మొత్తం పారితోషికం ఇచ్చారు అని, ఆయన మంచి నిర్మాత అంటూ కితాబు ఇచ్చింది. ఇక దర్శకుడు కొరటాల శివ కూడా నిర్మాత దానయ్యపై వస్తున్న పుకార్లను కొట్టి పారేశాడు. తనకు రావాల్సిన పూర్తి పారితోషికంను నయా పైసలతో సహా ఇచ్చేశాడు. నిర్మాతల్లో రామానాయుడు తర్వాత అంతటి ప్రొఫెషనల్‌గా దానయ్య ఉంటారు. ఆయన డబ్బుల విషయంలో, షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నటీనటులు మరియు టెక్నీషియన్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అంటూ కొరటాల శివ అభినందనలు తెలిపారు. అప్పట్లో రామానాయుడు మాత్రమే ఇలా ఉండేవారు, ఇప్పుడు ఉన్న నిర్మాతల్లో దానయ్య మాత్రమే అలా ఉన్నారు అంటూ కొరటాల నిర్మాతను ఆకాశానికి ఎత్తేశాడు. మరి ఈ పుకార్లు ఎలా పుట్టాయి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.