Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్యకేసులో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. మొన్నటిదాకా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించిన బస్సు కండక్టర్ అశోక్ కుమార్ హర్యానా పోలీసులు, పాఠశాల యాజమాన్యంపై కేసు పెట్టాడు. ప్రద్యుమ్న హత్యకేసులో తనను బలిపశువును చేశారని, హత్యచేసినట్లు ఒప్పుకోమని పోలీసులు దారుణంగా తనను హింసించారని అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశాడు. తన కొడుకు అశోక్ ను కావాలని ఈ కేసులో ఇరికించినట్టు అర్ధమవుతోందని, అందుకే తాము గురుగ్రామ్ పోలీస్ సిట్ బృందం, పోలీసులపై కేసు వేస్తున్నామని అశోక్ కుమార్ తండ్రి అమీర్ చంద్ చెప్పారు. హత్యానేరాన్ని ఒప్పుకోమని తన కొడుకును పోలీసులు కిరాతకంగా హింసించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు నేరస్థుడిని తప్పించేందుకు పోలీసులు తన క్లయింట్ ను బలిపశువును చేశారని అశోక్ తరపు న్యాయవాది మోహిత్ వర్మ ఆరోపించారు.
మరోవైపు ప్రద్యుమ్నను హత్యచేశాడని భావిస్తున్న 11వ తరగతి విద్యార్థి..తన తండ్రికి గతంలోనే ఈ విషయం చెప్పినట్టు సీబీఐ విచారణలో తేలిందని సమాచారం. ప్రస్తుతం ఆ విద్యార్థిని విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు తమ కస్టడీలో ఉంచుకున్నారు. అటు ఈ హత్య జరిగిన విధానం, తదినంతర పరిణామాలపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. హత్యచేసిన విద్యార్థి సంపన్నవర్గానికి చెందిన వాడు. పరీక్షలు వాయిదా పడాలని కోరుకున్నాడు. పాఠశాలలో విద్యార్థి ఎవరన్నా చనిపోతే స్కూలుకు సెలవు ఇచ్చి…పరీక్షలు వాయిదా వేస్తారని భావించాడు. తాను అనుకున్నప్పుడు సహజంగా స్కూల్లో ఎవరన్నా చనిపోవడం కుదరదు కాబట్టి తానే మర్డర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. స్కూలుకు వెళ్లిన తర్వాత తన తోటి విద్యార్థులతో అతను చాలా సహజంగానే ప్రవర్తించాడు. ఓ హత్యచేసేముందు నొటోరియస్ క్రిమినల్ కూడా కాస్త తత్తరపడతాడేమో. కానీ ఆ విద్యార్థి మాత్రం చాలా సహజంగా తోటి విద్యార్థులతో మీరేం కంగారు పడకండి..పరీక్షలు వాయిదా పడతాయి అని చెప్పాడు. తర్వాత కత్తి తీసుకుని నింపాదిగా వాష్ రూమ్ కు వెళ్లాడు. తనతో పాటు వాష్ రూమ్ కు ఎవరు వస్తే వారిని చంపుదామనుకున్నాడు.
దురదృష్టవశాత్తూ..ప్రద్యుమ్ న కూడా అదే టైంకి వాష్ రూమ్ కు వెళ్లి ఆ విద్యార్థి చేతిలో హతమయ్యాడు. నిజానికి సీబీఐ అధికారులు చెప్పినట్టు ప్రద్యుమ్న కాకపోతే మరొకరైనా ఆ రోజు ఆ విద్యార్థి చేతిలో హత్యకు గురయ్యేవారు. ముద్దులొలికిస్తూ కనిపించే ప్రద్యుమ్నను కత్తితో గొంతులో పొడిచిన తర్వాత కూడా ఆ పదహారేళ్ల కుర్రాడిలో పెద్ద భయం కనిపించలేదు. ఇంటికి వెళ్లి తండ్రితో తాను చేసిన ఘనకార్యం వివరించాడు. డబ్బులు బాగా ఉన్న ఆ తండ్రి…తన కుమారుణ్ని ఈ హత్యానేరం నుంచి బయటపడేసేందుకు తక్షణమే పథకం రచించాడు. ఇందుకు స్కూల్ మేనేజ్ మెంట్ సహకరించింది. అందరూ కలిసి స్కూల్ బస్సు కండక్టర్ పై హత్యానేరం తోసివేశారు. రోజూ పిల్లవాణ్ని ఇంటి దగ్గరనుంచి తీసుకు వచ్చి, మళ్లీ ఇంటిదగ్గర జాగ్రత్తగా దిగబెట్టే కండక్టర్ కు ఈ హత్యచేయాల్సిన అవసరం ఏంటి అని అందరికీ సందేహం వస్తుంది కాబట్టి లైంగిక దాడి అని కథ అల్లారు. ఇవీ ప్రద్యుమ్న హత్య జరిగిన రోజు తెర వెనక జరిగిన కుట్రలు.
నిజానికి స్కూల్ లోని వాష్ రూమ్ లోకి ఓ బస్సు కండక్టర్ తాగి వచ్చి అతనిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు….అని ప్రద్యుమ్న హత్య వెలుగుచూసిన తర్వాత వచ్చిన వార్తలు…ఎవరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. స్కూల్ వాష్ రూమ్ లోకి కండక్టర్ ఎలా వస్తాడు అన్నది ఒక అనుమానమైతే…లైంగిక దాడికి ప్రయత్నించింది బస్సులోనా…వాష్ రూమ్ లోనా అన్నదానిపై స్కూల్ యాజమాన్యం కానీ, హర్యానా పోలీసులు కానీ స్పష్టత ఇవ్వలేదు. హత్య విషయమూ, హత్యకు గల కారణం రెండూ బయటి ప్రపంచానికి ఒకే సారి తెలిసాయి. రేయాన్ స్కూల్లో విద్యార్థి హత్య, లైంగిక దాడికి ప్రయత్నించి కుదరకపోవడంతో బాలుణ్ని హత్యచేసిన బస్సు కండక్టర్ అన్న రెండు వార్తలూ జాతీయ, ప్రాంతీయ చానళ్లన్నింటిలో ఒకేసారి కనిపించాయి. సాధారణంగా హత్య విషయం ముందు తెలుస్తుంది. తర్వాత అనుమానితులెవరనే దానిపై చర్చ మొదలవుతుంది. కానీ ఈ కేసులో దానికి భిన్నంగా జరిగింది. హత్యచేసిన 11వ తరగతి విద్యార్థి, స్కూల్ మేనేజ్ మెంట్ కలిసి పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి అశోక్ కుమార్ ను ఇరికించారు. హర్యానా పోలీసులు సైతం వారికి వంత పాడినట్టే కనిపిస్తోంది. హత్య జరిగిన రోజు సాయంత్రానికే అశోక్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు, అతను నేరాన్ని అంగీకరించాడని కూడా ప్రకటించారు. అయితే ఈ కేసు దేశవ్వాప్తంగా సంచలనం సృష్టించడంతో హర్యానా ప్రభుత్వం విచారణను సీబీఐకి అప్పగించింది. దీంతో అసలు నిజం బయటకు వచ్చింది.
మంచి, చెడు తెలిసే వయసులోనే ఉన్నఓ 16 ఏళ్ల కుర్రాడు…పరీక్ష వాయిదా పడేలా చేసేందుకు ఓ చిన్నారి నిండు ప్రాణం తీసుకున్నాడంటే…ఆ తప్పు ఎవరిదిగా భావించాలి…ఆ కుర్రాడిదా లేక …అతన్ని సరిగ్గా పెంచలేకపోయిన తల్లిదండ్రులదా….పరీక్షల ఒత్తిడి పెంచే చదువులదా…లేక సంపన్న వర్గాల అహంకారపూరిత వైఖరిదా..లేక చెడు అలవాట్లను అందించే సమాజానిదా…నిజానికి ఇలాంటి ఘటనలు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో చూస్తుంటాము. గన్ కల్చర్ కు అలవాటు పడ్డ అక్కడి యువత కొందరు దారితప్పి ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారు. కానీ రేయాన్ స్కూల్ ఘటన చూసిన తరువాత మనదేశంలోనూ ఇలాంటి సంస్కృతి వ్యాపిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.