Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో చిన్నారులపై అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. కఠువా, ఉన్నావ్ ఘటనలను ప్రజలు మరవక ముందే దేశంలోని చాలా ప్రాంతాల్లో బాలికలపై రేప్, హత్యాచారాల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేకెత్తించింది. అయితే కేసు బయటకి వచ్చిన రెండే రోజుల్లో నిందితుడు శవమయి చెట్టుకి వేలాడడం ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఘటన జరిగిన రెండే రోజే కేసు క్లోజ్ అవ్వడం మీద దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా ఆ విషయం మీద పలు అనుమానాలు ఉన్నాయని నిందితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటన తరువాత బాదితురాలి తండ్రితో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బాబు పలు కీలక హెచ్చరికలు చేశారు. ఇటీవల జరిగిన కథువా, ఉన్నావో వంటి వరుస ఘటనలు దేశాన్నే కలచి వేస్తున్నాయని అదే విధంగా మన రాష్ట్రంలో కూడా కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడ తయారవుతున్నారని అందుకే ఈ ఘటన ఒక హెచ్చరిక కావాలని ఆయన పేర్కొన్నారు. అత్యాచారం చేస్తే ఎవ్వరినీ వదిలి పెట్టము. ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నేరం చేసినా ఏమీ జరగబోదనే ధీమా ఎవ్వరిలోనూ ఉండడానికి వీల్లేదని బాబు వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని ఎవ్వరయినా మరోసారి ఇటువంటి ఘటనకు పాల్పడితే కఠిన శిక్ష ఎదుర్కొంటారని బాబు అన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించడం కోసమే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ‘నేను సీఎంగా ఉన్నన్నాళ్ళూ ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు. భవిష్యత్తులో జరగవు కూడా. నేను ఎప్పుడూ మెతగ్గా ఉండను. కఠినంగా ఉండాలనుకుంటే చండశాసనుడినే. ఒక నేరం చేశాక, మనిషి తప్పించుకోలేని పరిస్థితి సృష్టించాం కాబట్టే… దొరికినా ఉరిశిక్ష తప్పదనే భయంతో దాచేపల్లి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 48 గంటల్లోగానే కేసు ఛేదించాం’’ అని సీఎం తెలిపారు. నిజమే మరి కథువా ఘటనలో నిందితులని వెనకేసుకొచ్చిన ఎమెల్యే మంత్రి అయ్యాడు. ఇక ఉన్నావ్ కేసు ఏమైందో కూడా తెలియని పరిస్థితుల్లో కేవలం 48 గంటల్లో కేసును సాల్వ్ చేయడం చంద్రబాబు చాణక్యం కనపడుతోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితురాలి తండ్రి మాకు న్యాయం జరిగింది అని చెప్పటం, జిల్లా ఎస్పీ నిందితుణ్ణి పట్టుకోలేకపోతే రిజైన్ చేస్తానని ప్రకటించటం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనాలుగా నెటిజన్లు పేర్కొంటున్నారు.