పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ్యుల వేతనాలను నెలకు 40వేల రూపాయలు పెంచినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు బంగాల్ శాసనసభలో ఓ ప్రకటన చేశారు.
అయితే ముఖ్యమంత్రి జీతంలో ఎలాంటి మార్పు లేదని ఆమె తెలిపారు. చాలాకాలం నుంచి ఆమె జీతం తీసుకోవటం లేదన్న విషయం తెలిసిందే. మరోవైపు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే….పశ్చిమ బంగాల్ ఎమ్మెల్యేల జీతాలు తక్కువగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అందువల్ల ఎమ్మెల్యేల జీతాలు 40వేల రూపాయలు పెంచినట్లు మమతా బెనర్జీ తెలిపారు. 40వేల పెంపు తర్వాత.. భత్యాలు, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అదనపు చెల్లింపులతో కలిపి ఎమ్మెల్యేల మొత్తం జీతం ఎంతో వెల్లడించలేదు.
‘మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు బాగానే ఉన్నాయి. కానీ మా రాష్ట్రంలో అంత జీతాలు ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు. అందుకే వేతనాలు పెంచాలని నిర్ణయించాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే రూ.40వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.