“నా కులం మాట నిలబెట్టుకొనే కులం” : సీఎం జగన్

"నా కులం మాట నిలబెట్టుకొనే కులం" : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్, వైఎస్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈమేరకు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ గత కొంత కాలంగా తన మతం, కులంపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ” గత కొద్ది రోజులుగా నా మతం, కులంపై వస్తున్న నీచమైన ఆరోపణలను వింటుంటే చాలా బాధగా ఉంది. కానీ ఎవరెన్ని అవాకులు, చవాకులు పేలినప్పటికీ కూడా నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకొనే కులం” అని సీఎం జగన్ వాఖ్యానించారు. ఈ వాక్యాలు విన్నటువంటి ప్రజలందరు కూడా ఒక్కసారిగా పెద్ద హర్షద్వానాలతో చప్పట్లు కొట్టారు. ఇకపోతే తాను అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రజలకోసం చేస్తున్నటువంటి పాలన ని చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నామని సీఎం జగన్ వాఖ్యానించారు.

కాగా గుంటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన కొత్త పథకం వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ఆసరా పథకం కింద చికిత్స చేయించుకున్న రోగులకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల ఆర్థిక సాయం అందించనున్నారు. దానికితోడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపోతే 2020 జనవరి నుండి నూతన హెల్త్ కార్డులతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు మరియు ఏప్రిల్ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో WHO స్టాండర్డ్స్ ఉన్న మెడిసన్స్ అందుబాటులోకి రానున్నాయని సీఎం జగన్ ప్రకటించారు.