ఏపీకి మూడు రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నిన్న సంచలన ప్రకటన చేసిన సీఎం జగన్ నేడు రాజధాని భూములపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కోసం రాజధాని ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన అసైన్డ్ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అయితే గత ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములను కొని వాటిని లాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చి అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి ప్లాట్ల రూపంలో భారీ ఎత్తున లబ్ధీ పొందాలని కొందరు నేతలు భావించారని వైసీపీ ముందు నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చింది. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం అసైన్డ్ భూములు ఒకరి నుంచి మరొకరికి విక్రయించే అధికారాలు లేవని ఆ భూముల యజమానులకు ఇవ్వాల్సిన ప్లాట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అంతేకాదు అసైన్డ్ భూములను అసలు హక్కుదారులకు తిరిగి ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.