సీఎం జగన్ విశాఖ నగరం పై ఫోకస్ పెట్టారు. నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహాలు పన్నుతున్నారు ఈ నాలుగు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టిడిపి గెలుపొందడంతో జగన్ షాక్ తిన్నారు.విశాఖ నగరంలో మాత్రం జగన్ పాచిక పారలేక పోయిన రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనం వీచింది. .దీంతో ఆ నాలుగు నియోజకవర్గాలను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొల్లగొట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో… అక్కడ ఎలాగైనా పట్టు సాధించాలన్న భావనతో ఉన్నారు. గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో సీఎం జగన్ ను విశాఖ ఎంపీ ఎంవీఎస్ సత్యనారాయణ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో అక్కరామని విజయనిర్మల విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు గెలుపొందారు. 2014లో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమే ఎదురైంది. విజయనిర్మలకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విఎంఆర్డిఏ చైర్పర్సన్, ఎమ్మెల్సీగా వంశీకృష్ణకు పదవి దక్కింది. వచ్చే ఎన్నికల్లో విజయనిర్మల, వంశీకృష్ణ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరితో పాటు జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కూడా ప్రయత్నిస్తున్నారు. దీంతో ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య ధోరణి నెలకొంది. నియోజకవర్గ వైసీపీలో సైతం గ్రూపులు నడుస్తున్నాయి. ఈ తరుణంలో జగన్ ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దించాలని భావిస్తున్నారు. ఇందుకు ఎంపీ ఎంవీఎస్ సత్యనారాయణ సరైన అభ్యర్థిగా భావిస్తున్నారు.
తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు. మరోసారి పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు. రామకృష్ణ బాబును ఎలాగైనా మట్టి కరిపించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎంవీఎస్ సత్యనారాయణ ను బరిలో దించడానికి డిసైడ్ అయ్యారు.నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం అధికం. ఇప్పుడు నగర మేయర్ గొలగాని సైతం అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఆ ముగ్గురు నేతలను పిలిపించుకున్న జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థికి బరిలో దింపుతానని.. అందుకు మీ ముగ్గురు సహకరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో ఎంపీ ఎంవీఎస్ సత్యనారాయణ సీఎం జగన్ కలిశారు. ఎంవీఎస్ సత్యనారాయణకు ఈనెల 25న తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను కట్టబెడతారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ముగ్గురు ఆశావాహులు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.