జగన్ జైలులో ఉన్న సమయంలోఅన్నయ్యకు తోడున్నా అంటూ సోదరి షర్మిల పాదయాత్ర చేశారు.. తర్వాత 2014 ఎన్నికల్లో జగన్కు అండగా నిలిచారు. 2019 ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి వైఎస్సార్సీపీకి ఓ విధంగా స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు షర్మిల.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు కేబినెట్, ఇతర నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో షర్మిలకు కూడా జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొద్దిరోజుల క్రితం చర్చ జరిగింది. ఢిల్లీ స్థాయిలో ఆ పదవి ఉండబోతుందనే ప్రచారం జరిగింది. కానీ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. తాజాగా మరోసారి షర్మిలకు కీలక పదవి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలయ్యింది. జగన్ పాలనాపరమైన పనులతో బిజీగా ఉన్నారు.. నవరత్నాల అమలు, కొత్త పథకాల రూపకల్పనలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని ఇలా బాధ్యతలు పెరిగాయి.
మరోవైపు వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని చూసుకోవడం ఓ విధంగా కాస్త కష్టమైన విషయమే.ఇటు ముఖ్యమంత్రి బాధ్యతలు.. అటు పార్టీ బాధ్యతలు.. ఇలా క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. అందుకే జగన్ పార్టీ వ్యవహారాలను సోదరి షర్మిలకు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారట. పార్టీ బలోపేతంతో పాటూ నేతలు, కార్యకర్తలకు ఎప్పుడూ ఒకరు అందుబాటులో ఉంటే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట.