కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జ‌గ‌న్‌

కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జ‌గ‌న్‌

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియమాకాలకు ఇకపై ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఏపీపీఎస్సీపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ మేరకు అధికారులను ఆదేశించారు.

2020 జనవరి నుంచే ఈ నిర్ణయాన్ని అమలుపరచాలని సూచించారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని.. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. దీంతో ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా నియామకాల్లో ఇంటర్వ్యూలు ఉండవు.. కేవలం మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపట్టనున్నారు

అధికారులతో సమీక్షలో భాగంగా ఏపీపీఎస్సీ ఉద్యోగ క్యాలెండర్‌పై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వాకాబు చేశారు. ప్రతి ఏడాది జనవరిలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్‌ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం కూడా ఉండేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా కోరారు.

పోస్టుల భర్తీలో తొలుత అత్యవసర విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు వెల్లడించగా.. ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వారికి సూచించారు.

ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మేరకు జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉద్యోగ ఖాళీల వివరాలను పంపాల్సిందిగా శాఖాధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నవంబరు చివరి నాటికి ఆయా శాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అందనున్నాయి. ఈ ఖాళీల వివరాలపై సీఎస్‌ సమీక్ష అనంతరం ఆర్థికశాఖ ఆమోదానికి అనుగుణంగా జనవరి మొదటివారంలోనే ఉద్యోగ ‘క్యాలెండర్‌’ ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు అంటున్నారు. ఏపీపీఎస్సీ ప్రకటించే ‘క్యాలెండర్‌’లో ఉద్యోగ ప్రకటనల జారీ, పరీక్షల నిర్వహణ తేదీలను పొందుపరచనున్నారు.