దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం

దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం

వచ్చే మార్చిలోగా హుజురాబాద్‌ నియోజకవర్గంతోపాటు మరో 4 మండలాల్లో పూర్తి సాచురేషన్‌ స్థాయిలో దళిత బంధు అమలు చేస్తాం. దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసి పథకాన్ని అందిస్తాం. ఆయా నియోజకవర్గాల్లో ఒకే గ్రామం నుంచి ఆ వంద కుటుంబాలను ఎంపిక చేస్తారా? రెండు మండలాల నుంచి ఎంపిక చేస్తారా? మున్సిపాలిటీల నుంచి తీసుకుంటారా? అన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలకు వదిలేస్తాం.’’

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్‌ పార్టీనే. ఇక కేంద్రంలోనూ సత్తా చాటుతాం. యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో టీఆర్‌ఎస్‌కు ఐదుగురు ఎంపీలు ఉన్నా కీలకమయ్యాం. త్వరలో కేంద్రాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాం. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాం. బీసీలకు మరిన్ని అవకాశాలు దక్కాలంటే కులాల వారీగా జనగణన చేపట్టాలి. ఈ డిమాండ్‌ న్యాయమైనదే. కానీ కేంద్రం అలా జనగణన చేపట్టలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. దీనిపై శాసనసభలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపుతాం.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 1.5 లక్షల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పటివరకు 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కావాలంటే వాళ్ల ఫోన్‌ నంబర్లతో సహా సభకు ఇస్తాం. దసరా తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చించి కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం. తర్వాత ఒకటి రెండు నెలల్లో కొత్తగా 70 వేల నుంచి 80వేల ఉద్యోగాలు వస్తాయి. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కొత్త జోనల్‌ విధానం తెచ్చాం.

వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని.. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 2 వేల కుటుంబాలకు చొప్పున మొత్తం 2 లక్షల కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ పథకం అమలు కోసం ఇప్పటికే నిధులు విడుదల చేశామని.. మరో నాలుగు మండలాల్లోనూ అమలు చేసేందుకు మరో రూ.వెయ్యి నుంచి రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ పథకం అమలుపై అవగాహన ఏర్పడాలని పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని.. తర్వాత పథకాన్ని పూర్తి స్థాయిలో అద్భుతంగా, సాఫీగా అమలు చేస్తామని చెప్పారు. దళితబంధుపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అధికార, విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆర్‌ బదులిచ్చారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..

రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు అమలు చేస్తాం. లబ్ధిదారులు తమకు నచ్చిన, అనుభవమున్న పని చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయదు. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అందుతుంది. సంతృప్త స్థాయిలో ఉద్యోగులు, వ్యాపారులనే తేడా లేకుండా అందరికీ వర్తింపజేస్తాం. కొందరు పథకం వద్దని వెనక్కి ఇచ్చే వాళ్లుకూడా ఉన్నారు.

హుజూరాబాద్‌లో ఇప్పటికే ఇద్దరు రిటైర్డ్‌ ఉద్యోగులు ఆత్మగౌరవ సాక్షిగా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయడం నిజంగా గొప్ప విషయం. రాష్ట్రంలో 17.53 లక్షల దళిత కుటుంబాలున్నట్టు అంచనా. గణాంకాలు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా రూ.1.80 లక్షల కోట్లతో దళితబంధు అమలు చేయాలని అంచనా వేశాం. కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తే మరింత వేగంగా లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందించే ఏర్పాట్లు చేస్తాం.

దళితబంధు సాయాన్ని వెనక్కి తీసుకుంటారని కొన్నిచోట్ల చిల్లర ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజలకు సాయం చేసేది మాత్రమే. వెనక్కి గుంజుకునేది కాదు. ఉప ఎన్నిక కోసం ఈ పథకం ద్వారా డబ్బులు పంచుతున్నారనే ప్రచారం సరికాదు. హుజూరాబాద్‌ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ పార్టీకి చాలా చిన్న విషయం. ఎన్నికలతో సంబంధం లేకుండా అంతటా ఈ పథకాన్ని అమలు చేస్తాం. వ్యాపార లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. బార్లు, వైన్స్‌లు, మెడికల్‌ కాంట్రాక్టర్లు, ఫర్టిలైజర్‌ షాపులు, సరుకుల పంపిణీ కాంట్రాక్టుల్లో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తాం.

అంబేడ్కర్‌ స్పూర్తిని కొనసాగించాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎస్సీల కోటా పెంచాల్సిన అవసరం ఉంది. పదేళ్ల కిందటి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. ఇప్పుడు వారి జనాభా శాతం పెరిగింది. మంచిర్యాలలో అత్యధికంగా 25.64 శాతం, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో 20శాతం కంటే ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్నట్టు ఏడేళ్ల కిందటి సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది.

ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రానికి రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపింది. పలుమార్లు ప్రధానికి స్వయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. మీరు (బీజేపీ ఎమ్మెల్యేలు) పెద్దవాళ్లు కదా.. ప్రధానిని ఒప్పించి తీసుకుని వర్గీకరణ తీసుకురండి. విమానాశ్రయంలో పెద్ద పెద్ద పూలమాలలతో ఘనస్వాగతం పలుకుతాం. మళ్లీ ఢిల్లీకి అఖిలపక్షం ఎందుకు?

మాది అందరి ప్రభుత్వం. ప్రస్తుతం అత్యంత వెనుకబడిన వాళ్లు దళితులు కావడంతో వారికి ముందుగా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. ఎస్టీల్లో కూడా పేదలున్నారు. వాళ్లకు న్యాయం చేస్తాం. బీసీలు, మైనారిటీలు, ఓబీసీల్లో పేదలకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అన్ని వర్గాలతో చర్చించి కొత్త పథకాలను ప్రవేశపెడతాం. కోవిడ్‌–19తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రస్తుతం ఆ కష్టాల నుంచి గట్టెక్కుతున్నాం.

‘‘ఒక్క హుజూరాబాద్‌కే నిధులు విడుదల చేశారా? ఇతర ప్రాంతాలకు కూడా విడుదల చేస్తారా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పెద్ద అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం రఘునందన్‌రావు గారు! రాష్ట్రం తెచ్చిన వాళ్లం. మాకు చాలా బాధ్యత ఉంది. మేమే ముందు నిలుస్తాం.. మీరు ఉండేదా? సచ్చేదా? నాకు అర్థంకాదు. మాకు అన్ని అంచనాలున్నాయి. కొద్దిమందికి ఈస్ట్‌మన్‌ కలర్‌ డ్రీమ్స్‌ ఉండొచ్చు. ప్రజలు ఎవర్ని ఉంచుతరో? ఉంచరో మాకు తెలియదా? మాది రాజకీయ పార్టీ కాదా? మాదేమైనా మఠమా? కచ్చితంగా మున్ముందు కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుంది. ఇన్ని మంచి పనులు చేస్తుంటే ప్రజలు ఏ కారణంతో పక్కనపెడ్తరు?

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశవ్యాప్తంగా దళితులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు దళితుల కోసం చేసినదేమిటి? కాంగ్రెస్‌ ప్రభుత్వం భూపంపిణీ చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్తున్నారు. రాష్ట్రంలో 75 లక్షల మంది దళిత జనాభా ఉంటే.. వారి వద్ద 13 వేల ఎకరాల భూములే ఉన్నాయి. అతి తక్కువగా రైతుబంధు డబ్బులు అందుతున్న దళిత రైతులకే. రూ.15 వేల కోట్ల రైతుబంధు సాయంలో వారికి వెళ్తున్నది రూ.1,400 కోట్లే. అందుకే దళితబంధు మొదలుపెట్టుకున్నాం. గత ఏడేళ్లలో రాష్ట్ర ఆదాయం రాకపోక రూ.10 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే ఏడేళ్లలో ఇది రూ.23 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో రూ.1.80 లక్షల కోట్లు ఒక లెక్కా.. గత ఏడాదే దళిత బంధు అమలు చేయాలనుకున్నాం. కరోనాతో ఆలస్యమైంది.

రాష్ట్రంలో పోడుభూముల సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతాం. గిరిజనేతరుల ఆక్రమణలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అటవీ భూమినే నమ్ముకుని సాగు చేసుకుంటున్న వారికి తప్పకుండా పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తా. గిరిజనేతరుల అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాం. ఈనెల మూడో వారంలో కొత్తగా క్లెయిమ్స్‌ పిలుద్దాం. దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించే చర్యలే కాకుండా అటవీ పరిరక్షణకు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఇకపై అటవీ ఆక్రమణలు జరగవనే స్పష్టత తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వినియోగం, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణం, ఆరోగ్య లక్ష్మి, వాగులపై చెక్‌డ్యామ్‌లు, ఆరోగ్య రికార్డుల వివరాలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించిన ప్రశ్నలపై సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. తర్వాత విద్యుత్‌ శాఖకు చెందిన నివేదికలను మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు. జీరో అవర్‌లో 32 మంది సభ్యులు తమ నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించారు.

రాష్ట్రంలో పోడు వ్యవసాయం, అటవీ భూములపై హక్కుల చట్టంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మద్యం బెల్టు షాపులపై బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు వాయిదా తీర్మానాలు ఇవ్వగా స్పీకర్‌ తిరస్కరించారు. తర్వాత దళితబంధుపై స్వల్పకాలిక చర్చను ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ ప్రారంభించగా.. ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా, భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ చర్చలో పాల్గొన్నారు. వారు సుమారు రెండు గంటల పాటు ప్రసంగించి పలు అంశాలను లేవనెత్తారు. తర్వాత సుమారు గంటన్నర పాటు సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం ప్రకటించారు.