తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రచారమంతా కాంగ్రెస్ కంటే ఎక్కువగా టీడీపీ లక్ష్యంగానే సాగుతోందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జరిగిన మూడు ప్రచార సభల్లోనూ టీడీపీ మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణలో అసలు టీడీపీకి పనేముంది, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే మరోసారి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. తెలంగాణకు చంద్రబాబు శని అని టీడీపీ మీదా, చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. కానీ, ఇదంతా ప్రజల వరకే కానీ నాయకుల విషయానికి వచ్చేసరికి, ఎన్నికల వ్యూహాల దగ్గరకు వచ్చేసరికి కేసీఆర్ తీరు మరోలా ఉంటోంది. అదేంటంటే ఎన్నికల వ్యూహాల దగ్గరకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అనుసరణనీయం అయిపోయింది.
దానికి కారణం నిన్న జరిగిన అభ్యర్ధుల సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తరహా వ్యూహాన్ని అనుసరించాలంటూ వారికి కేసీఆర్ చేసిన సూచన. 2014 ఎన్నికల్లో అతి విశ్వాసంతో జగన్ ఆంధ్రాలో ఓడిపోయారనీ, పక్కా ప్రణాళికతో టీడీపీ విజయం సాధించిందన్నారు. అదే వ్యూహాన్ని అనుసరించి 2019 ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు గెలవాలని కేసీఆర్ అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రారంభమైన తొలి గంటలోనే టీడీపీ మద్దతుదారులను పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు రప్పించగలిగారనీ, ఆ తరువాత ప్రత్యర్థి శిబిరాలపై ఫోకస్ పెట్టారనీ, తద్వారా టీడీపీ అనుకున్న స్థాయిలో ఓటింగ్ చేయించుకో గలిగిందని కేసీఆర్ నేతలకు వివరించారు.
తెలంగాణలో మన నేతలంతా అదే వ్యూహాన్ని అనుసరించి, లబ్దిదారులు అందర్నీ కలవాలని, పోలింగ్ రోజున ఓటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే మద్దతుదారులంతా వచ్చేట్టు చూసుకోవాలన్నారు. జగన్ మాదిరిగా ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్లొద్దని కూడా సూచించారు. అంటే కేసీఆర్ కి తెలంగాణలో టీడీపీ అవసరం లేదంటారుగానీ, తెరాసకు ఆ పార్టీ వ్యూహాలు అవసరం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.