రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై ఈరోజు సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం విషయంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వివాదాలకు తావు లేకుండా అన్ని రకాల పరీక్షల నిర్వహణకు స్వతంత్ర్య సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని దీనిపై త్వరలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌తో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ అంశాన్ని పర్యవేక్షించాలని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరవగా.. 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరికీ ఉచితంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించిన విద్యార్థులకు సొమ్ము తిరిగి చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలపైనా కేసీఆర్ స్పందించారు. ఆత్మహత్యలు బాధాకరం అన్నట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ అందిస్తున్న సంస్థ సామర్థ్యంపైనా సీఎం ఆరా తీసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే టెండర్‌కు ఆహ్వానించి, బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.