తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సర్కార్ మరో షాక్ ఇచ్చింది. దాదాపు 50 రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు విధులను వదిలేసి సమ్మెలో పాల్గొన్నారు. అయితే కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో నిన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కార్మికులు ఉద్యోగాలలో చేరిపోయారు.
అయితే కార్మికులను సమ్మెకు వెళ్ళేలా ఉసిగొల్పిన కార్మిక నేతలపై సీరియస్గా ఉన్న సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక మీదట యూనియన్లు అవసరం లేకుండా అన్ని డిపోలలో వర్కర్స్ వెల్ఫేర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అయితే బస్ భవన్లోని టీఎంయూ ఆఫీసుకు శుక్రవారం అధికారులు తాళం వేశారు.
కాగా తాజాగా కార్మిక నేతలకు మొన్నటి వరకు కల్పించిన డ్యూటీ రిలీఫ్ హక్కులను కూడా ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. దీంతో ఇక నుంచి వారు కూడా సాధారణ కార్మికుల మాదిరే డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు అటు కార్మికుల నుంచి యూనియన్ సభ్యత్వ రుసుము కింద ఏడాదికి వెయ్యి రూపాయలు వసూల్ చేసే విధానాన్ని కూడా రద్దు చేయాలన్ని ఆర్టీసీ యాజమాన్యం ఆలోచిస్తుంది.