కృష్ణా జిల్లా నందిగామలో కలకలం రేగింది. ఐతవరం వద్ద కారులో ఓ మృతదేహం బయటపడింది. హైవే పక్కన రోడ్డుకు దిగువలో ఓ కారు ఉండటాన్ని తెల్లవారుజామున కొందరు స్థానికులు గుర్తించారు. ఏం జరిగిందో చూద్దామని వెళ్లి చూస్తే కారు వెనుక సీట్లో మృతదేహం కనిపించింది. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని, ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయ రామ్ గా గుర్తించారు. కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, హెమారస్ ఫార్మా కంపెనీ ఎండీగా ఆయన పనిచేస్తున్నారు. జయరామ్ ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ గానూ కొన్నాళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత ఆ చానల్ మూత పడింది.
జయరామ్ కుటుంబం ప్రస్తుతం అమెరికాలో నివాసముంటుండగా ఆయన తల్లిదండ్రులు విజయవాడ కానూరులో ఉంటున్నారు. అయితే ఆర్థికపరమైన వివాదాలే ఈ ఘటనకు కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. చిల్లకల్లు,సూర్యాపేట చెక్ పోస్టు సెంటర్లలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కారును తెల్లరంగు చొక్కా వేసుకున్న వ్యక్తి నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. తలపై గాయాలు, జయరాం చేతులు నలుపురంగులోకి మారటంతో విషప్రయోగం చేసి దాడి చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయరామ్ ను హత్య చేసినట్లుగా ప్రాధమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెండ్రోజుల క్రితం జయరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరినట్లు పోలీసులకు సమాచారం అందింది. కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు.