ఏపీలో హోదా బంద్…వైసీపీ, బీజేపీ, జనసేనలు తప్ప…!

AP Bandh For Special Status

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హోదా సాధన సమితి పిలుపు మేరకు శుక్రవారం బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు వైసీపీ, బీజేపీ, జనసేన మినహా టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు సంఘీభావంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరుకానున్నారు. అలాగే వ్యాపార, వాణిజ్య, ప్రైవేటు విద్యా సంస్థలు సైతం బంద్‌కు తమ సంఘీభావం తెలిపాయి. ర్యాలీలు, నిరసన ప్రదర్శనల్లో టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారని అమరావతి ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

ఆర్టీసీతోపాటు ఏపీఎన్‌జీవో సైతం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలపడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలు ఎదుట ప్రజా సంఘాలు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు బైఠాయించి, బస్సులను అడ్డుకుంటున్నారు. హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రైల్వేస్టేషన్‌ కు అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్తారు. బంద్‌ దృష్ట్యా శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు ఇంటర్‌ బోర్టు తెలిపింది. వాయిదా వేసిన పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. ఏయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యా సంస్థలు కూడా ముందస్తు సెలవును ప్రకటించాయి. మరోవైపు, టీడీపీ మద్దతు తెలిపే బంద్‌ లలో తాము పాల్గొనేది లేదని వైసీపీ ఇప్పటికే సష్టం చేసింది. అలాగే అత్యవసరమైతే తప్ప బంద్‌లో పాల్గొనకూడదనేది తమ విధానమని, ఈ బంద్‌లో తాము పాల్గొనడం లేదని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.