లోక్ సభలో టీడీపీ ఎంపీల సస్పెన్షన్…!

Tdp Mps Suspension In Loksabha

లోక్‌సభ సమావేశాల మొదలైనప్పటి నుంచి టీడీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ టీడీపీ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు సభలో ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో లోక్‌సభ నుంచి 14 మంది టీడీపీ ఎంపీలును స్పీకర్ సస్పెండ్ చేశారు. అయినా వారు వెల్‌‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. సభ్యులందరూ బయటకు వచ్చినప్పటికీ టీడీపీ ఎంపీలు మాత్రం సభలోనే నిరసన చేపడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రఫెల్ ఒప్పందంపై చర్చ జరగాల్సి ఉన్నందున టీడీపీ ఎంపీల ఆందోళనతో దానిపై ఉత్కంఠ నెలకొంది.

టీడీపీ ఎంపీలతో పాటు ఆందోళన చేస్తున్న తొమ్మిది మంది అన్నాడీఎంకే ఎంపీలను కూడా సభ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో ఎంపీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా జనవరి 1 నుంచి వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వారిని సస్పెండ్ చేయాలంటూ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందుకే సెక్షన్ 374ఏ ప్రకారం వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వారిని నాలుగు లేదా ఐదు రోజుల పాటు సస్పెండ్ చేయాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నిన్న కావేరి జలాలపై ఆందోళనకు దిగిన 24 మంది అన్నాడీఎంకే ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్ ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న 14 మంది టీడీపీ ఎంపీలు, మిగిలిన 9 మంది అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు.